అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు వార్తల్లో లేకుండా టాలీవుడ్లో ఒక్క వారం కూడా గడవదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన సక్సెస్ రేట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పరిశ్రమకు సంబంధించి ఏ కీలక పరిణామం చోటు చేసుకున్నా ఆయన అందులో కీలకంగా ఉంటారు. కొత్త ఏడాదిలో ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఆయన ప్రొడక్షన్ నుంచి వచ్చిన బలగం సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. తెలంగాణ గ్రామాల్లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ల గురించి తలెత్తిన వివాదంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. ఈ సందర్భంగా తన రాజకీయ అరంగేట్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ ఎంట్రీ మీద దృష్టిపెట్టిన రాజు.. అందులో భాగంగానే బలగం సినిమాను నిర్మించారనే చర్చ కూడా నడిచింది ఈ మధ్య.
ఇదే విషయమై ఈ ప్రెస్ మీట్లో రాజును ప్రశ్నిస్తే.. ఆసక్తికర రీతిలో స్పందించారు.
రాజకీయాల్లోకి రావడాన్ని నేరుగా ఖండించలేదు. అలాగని వస్తా అనీ చెప్పలేదు. నన్ను రాజకీయాల్లో కి రమ్మని అడుగుతున్నారు. నాకే ఇంకా స్పష్టత లేదు. వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నా. సినిమా పరిశ్రమలోనే నా మీద ఎవరైనా విమర్శలు, కామెంట్లు చేస్తే తట్టుకోలేను. ఇక్కడే నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నారు. అక్కడ రాళ్లు వేస్తే నేను తట్టుకోలేనని అనుకుంటున్నా. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మానసికంగా అన్నింటికీ సిద్ధపడి వెళ్లాలి. నా వల్ల కాకపోవచ్చు. ఇందులోనే మీకు కావాల్సిన సమాధానం వెతుక్కోవచ్చు అని దిల్ రాజు అన్నాడు.
రాజు మాటల్ని బట్టి చూస్తే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లే ఉంది. ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారు, ఆహ్వానిస్తున్న వారూ ఉన్నారు. ఇప్పుడిలా అన్నా భవిష్యత్తులో ఆయన ఈ రంగంలోకి అడుగు పెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం.