గతంలో టాలీవుడ్ లో సినిమాలు ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత హిట్ అయినట్లు. సినిమా హిట్ అయితే అర్ధ శత దినోత్సవాలు…శత దినోత్సవాలు జరిగేవి. కానీ, కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. శత దినోత్సవాలు పోయి జత దినోత్సవాలు వచ్చాయి. అంటే సినిమా ఫట్ అయితే పట్టుమని పది రోజులు కూడా ఆడదు. అదే హిట్ అయితే, ఓ 20 రోజులు ఆడితే చాలు అనుకునే పరిస్థితి. సినిమా ఎన్ని రోజులు ఆడిందన్నది కాదన్నయ్య…ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్నదాన్ని బట్టి హిట్టా ..ఫట్టా అని తేల్చేస్తున్నారు ట్రేడ్ పండితులు.
అయితే, కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్, మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయని నిర్మాతలు చెబుతున్నారు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం దగ్గర మొదలైన ఈ ఫేక్ కలెక్షన్స్ టాపిక్ తాజాగా సర్కారు వారి పాట వరకు కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలకు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోన్న లెక్కలు ఒకలా ఉంటే.. నిర్మాతలు ప్రకటిస్తున్న లెక్కలు మరోలా ఉంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆఖరికి ఈ విషయంపై సూపర్ స్టార్ కృష్ణ కూడా స్పందిచారంటే మ్యాటరెంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డిస్ట్రబ్యూటర్గా ఏ రోజు కలెక్షన్స్‌ను ఆ రోజు నిర్మాతకు పంపటం వరకు నా బాధ్యత. అలాగే పంపేస్తుంటాను. అంతే తప్ప ఆ కలెక్షన్స్‌ను నేను చెప్పలేను. నిర్మాతలతో ఏం చెప్తే.. జనాలు ఏం నమ్మితే అలాగే వెళుతుంది’ అని దిల్ రాజు అన్నారు. సినిమా కలెక్షన్ల విషయంలో సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య యుద్ధంపై కూడా ఆయన స్పందించారు.
ఫేక్ కలెక్షన్స్ వల్ల ఒరిగేదీ ఏది లేదని, ఫ్యాన్స్‌కు కూడా ఓ అరగంట ఆనందం మాత్రమే ఉంటుందని దిల్ రాజు తేల్చేశారు. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత కలెక్షన్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బయట నిర్మాతలు చెబుతున్న కలెక్షన్స్, డిస్ట్రిబ్యూటర్స్ పంపే లెక్కలు వేరు అని దిల్ రాజు పరోక్షంగా ఒప్పుకోవడంతో అసలు సినిమా కలెక్షన్లు ఎంత అన్నది భేతాళ ప్రశ్నగానే మిగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.