ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీకి సై అన్న హనుమాన్ చిత్రానికి చాలినన్ని థియేటర్లు ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రధానంగా అగ్ర నిర్మాత దిల్ రాజు నింద ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి సినిమాల్లో ఆయన చిత్రమేది లేదు. అయితే మహేష్ బాబు చిత్రం గుంటూరు కారంను నైజాం, వైజాగ్ ఏరియాలో రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
హైదరాబాద్ లాంటి చోట్ల దిల్ రాజు మేజర్ స్క్రీన్లను ఆ సినిమాకి తీసుకావడంతో హనుమాన్ చిత్రానికి మరీ తక్కువ థియేటర్లు వచ్చాయని అంటున్నారు. ఈ వివాదానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై దిల్ రాజు మండిపడ్డ సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి లైన్ లోకి వచ్చాడు. హనుమాన్ థియేటర్లకు సంబంధించి వివాదంపై ఆయన ఘాటుగా స్పందించాడు. హనుమాన్ కు థియేటర్లు ఇవ్వకుండా దిల్ రాజు వర్గం ఇబ్బంది పెడుతోందని ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి సంస్థ అధినేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో శిరీష్ స్పందించాడు.
గత ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు తాము థియేటర్లు ఇవ్వలేదా అని ప్రశ్నించాడు. హనుమాన్ చిత్రాన్ని గుంటూరు కారంతో ఎందుకు పోల్చుకుంటున్నారని ఆయన ప్రశ్నించాడు. గుంటూరు కారం సినిమా మీద తమ 40 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని, హనుమాన్ చిత్రాన్ని ఏడు కోట్లకే కొన్నారని.. ఈ రెంటికి పోలిక ఏంటని ఆయన అన్నాడు. హనుమాన్ చిత్రాన్ని నా సామి రంగతో పోల్చుకుని చూడాలని.. అప్పుడు రెండు సినిమాలకు థియేటర్లు ఎన్ని వచ్చాయో చూసుకుంటే పరిస్థితి అర్థం అవుతుందని శిరీష్ పేర్కొన్నాడు. హనుమాన్ టీం కాంట్రవర్సీ కోసం దిల్ రాజు గుంటూరు కారం పేర్లను వాడి క్యాష్ చేసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించాడు.