రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అని…మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను ప్రస్తుత కాలంలో చాలామంది పొలిటిషియన్లకు వర్తిస్తుంది. జనానికే కాదు వీలు దొరికితే చాలు ప్రతిపక్ష నేతలపై బురద జల్లడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం, దూషించడం….వంటివి చేస్తూ రాజకీయ నాయకులంటే జనానికి అసహ్యం వేసేలా కొందరు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉంటారని అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి.
అయితే, ప్రస్తుత రాజకీయాల్లోనూ హుందాగా వ్యవహరించేవారు, ప్రతిపక్ష నేతలను సైతం గౌరవించే వారు, కేవలం రాజకీయంగా కూడా విపక్షాల మీద సహేతుకమైన విమర్శలు చేసేవారు ఉన్నారు. ఈ కోవలోకే ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావుగారి సేవలు చిరస్మరణీయమని షర్మిల కొనియాడిన వైనం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఏడాది ఏప్రిల్ 20న చంద్రబాబు బర్త్ డే సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉప్పు, నిప్పులా విమర్శలు గుప్పించుకున్నప్పటికీ…చంద్రబాబుకు జగన్ పద్ధతిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పర్వాలేదనిపించారు. కానీ, చంద్రబాబుకు వెటకారంగా బర్త్ డే విషెస్ చెబుతూ విజయసాయి చేసిన ట్వీట్ ను మాత్రం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సహా పలువురు తీవ్రంగా ఖండించారు. విపక్ష నేతకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదుగానీ…విజయసాయి ఈ స్థాయికి దిగజారి విషెస్ చెప్పడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
కట్ చేస్తే, తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. విషెస్ చెప్పేటపుడు హుందాతనం చూపిన షర్మిలను సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. విషెస్ ను కూడా చండాలం చేసి రాష్ట్రమంతటా విమర్శలు ఎదుర్కొన్న విజయసాయిరెడ్డికి…విపక్ష నేతలను కూడా గౌరవించాలన్న షర్మిలకు తేడా ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కనీస రాజకీయ మర్యాద పాటించకుండా సాయిరెడ్డి చేసే చెత్త ట్వీట్లు… చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తాయని…అదే సమయంలో వైసీపీకి డ్యామేజ్ చేస్తాయని చురకలంటిస్తున్నారు.
”పటేల్..పట్వారి వ్యవస్థలను రద్దు చేసి..బిసి లకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు..మహిళలకు ఆస్థి హక్కు కల్పించి..రెండు రూపాయలకే కిలో బియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన..నందమూరి తారక రామారావు గారిని..వారి జన్మదినం సందర్భగా..వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది #NTRJayanthi” అంటూ వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనీసం షర్మిలను చూసైనా వీసా రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.