కరోనా సెకండ్ వేవ్ లో మన దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. చాలామంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆక్సిజన్ ప్లాంట్లు, బ్యాంకులు ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం వంటివి చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో చంద్రబాబు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయగా…టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి తాజాగా ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు. అయితే, ఈ రెండింటి వల్ల కలిగే ప్రయోజనం ఒక్కటే అయినా…వాటి మధ్య ఉన్న తేడా గురించి చాలామందికి తెలియదు.
ఒక ఆస్పత్రి, లేదా ఒక భవనం ప్రాంగణంలోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ ను తయారు చేసి అందించేది ఆక్సిజన్ ప్లాంట్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో, కర్నూలులో సోనూసూద్ రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ఆక్సిజన్ ప్లాంట్, ఏపీలో మరో నాలుగు చోట్ల హెరిటేజ్ ఫండ్స్ తో NTR ట్రస్ట్ సంయుక్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయి. ఇవన్నీ ప్లాంట్ల కోవలోకి వస్తాయి.
ఇక, తయారు చేసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ ను సిలిండర్లలో నింపుకొని కావాల్సిన ప్రాంతాలకు, ప్రజలకు అందుబాటులో ఉంచేది ఆక్సిజన్ బ్యాంక్. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఈ తరహా ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆక్సిజన్ బ్యాంక్ లో ఆక్సిజన్ సిలిండర్లు మాత్రమే లభ్యమవుతాయి. ఇక్కడ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉండదు.