ఆంధ్రావని వాకిట నాలుగు సందర్భాలు పూర్తిగా గుర్తుపెట్టుకుని తీరాల్సిందే ! అంతగా గుర్తుపెట్టుకోదగ్గ ఆ పరిణామాలు విషాదాంతాలు అయి ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, ప్రస్తుత యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా ప్రజల విషయంలో విషమ పరిస్థితుల నేపథ్యాన ఎలా ఉన్నారు అన్నదే ముఖ్యం.
ఏ నాయకుడు అయినా దుఃఖంలోతుల్లో ఉన్న మనుషులకు భరోసా ఇవ్వాలి. ఆ విధంగా గత ప్రభుత్వ హయాంలో రెండు తీవ్ర తుఫానులు కదిపి కుదిపేశాయి. వాటిని చూసి తట్టుకోవడమే కాదు వాటిని దాటి నిలదొక్కుకోవడం కూడా కష్టమే ! అలాంటి సందర్భంగా చంద్రబాబు ఎలా ఉన్నారు.. అన్నది ఓ సారి చూద్దాం. వీటితో పాటు మరో ముఖ్యమయిన రెండు సందర్భాలను కూడా చర్చించుకుందాం.
హుద్ హుద్ తుఫాను వేళ చంద్రబాబు.. తిత్లీ తుఫాను వేళ చంద్రబాబు.. ఈ రెండు సందర్భాల్లోనూ చంద్రబాబు క్షేత్ర స్థాయిలోనే ఉన్నారు. బాధిత ప్రాంతాలలో బస్సులో మకాం వేసి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అప్పట్లో సచివాలయం స్థాయి ఉన్నతాధికారులంతా సీఎం కాన్వాయ్ లోనే.. ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు. ఎవ్వరికీ సెలవులన్నవి లేవు. హుద్ హుద్ తుఫాను కారణంగా విశాఖ నగరంలో ఎన్నో చెట్లు నేల కూలాయి.
విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నింటి ఆనవాళ్లే లేకుండా పోయాయి. అప్పట్లో విశాఖలో చంద్రబాబు చూపిన చొరవ కారణంగా వారంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. భారీ వృక్షాల తొలగింపు చర్యలను అదే పనిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టాయి. అప్పటి ముఖ్యమంత్రి కృషి ఫలించింది. విశాఖ నగరానికి పూర్వ ప్రాభవాన్ని తీసుకువచ్చే విధంగా ఎయిర్ పోర్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
అన్నీ కలిసి వచ్చి హుద్ హుద్ తుఫాను కష్టం నుంచి విశాఖ నగరం బయటపడింది. అదే సమయంలో శ్రీకాకుళంలో కూడా ప్రభావిత ప్రాంతాల్లో అప్పటి ముఖ్య నేతలు పర్యటించి, ఇక్కడ నెలకొన్న సమస్యలు వెనువెంటనే పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. తరువాత కాలంలో హుద్ హుద్ ఇళ్లు కూడా విఖ్యాత మీడియా ఈనాడు నేతృత్వాన నిర్మాణానికి నోచుకున్నాయి. విశాఖలోనే కాదు , టెక్కలి నియోజకవర్గం, సంతబొమ్మాళి మండలం, పాత మేఘవరంలోనూ.. అంతే స్థాయిలో అంతే నిబద్ధతతో రూపుదిద్దుకున్నాయి.
అటుపై వచ్చిన తిత్లీ తుఫాను సమయంలోనూ చంద్రబాబు (అప్పటి ముఖ్యమంత్రి) ఇదే నిబద్ధతతో పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం సర్వం కోల్పోయిన వేళ యువ ఎంపీ రామూ, యువ నేత లోకేశ్ బాధిత ప్రాంతాలలో కలిసి పర్యటించి, సహాయక చర్యలు చేపట్టారు. అప్పటి మంత్రి అచ్చెన్న సైతం ఎంతో చొరవ చూపి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఈ రెండు తుఫాను సహాయక చర్యలలో కొన్ని తప్పిదాలు, కొంత నిధుల దుర్వినియోగం ఉందన్న ఆరోపణలు అప్పట్లో విపక్షం నుంచి వినిపించాయి.
అయినా, అవేవీ ప్రజల పరిగణనలో లేకుండా పోయాయి. తిత్లీ వేళ కూడా మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేసి అప్పటి సీఎం సెహబాష్ అనిపించుకున్నారు. అటుపై ఆయన అధికారం కోల్పోయాక వచ్చిన వరదల కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. వాటికి ఇప్పటిదాకా మోక్షమే లేదు. ఇంకా కొంత పని చేయాల్సి ఉంది. డ్యాంకు తాత్కాలిక ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారే కానీ ఇప్పటిదాకా శాశ్వత చర్యలన్నవి లేనేలేవు.
ఇప్పటి సీఎం ఇంతవరకూ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన దాఖలాలే లేవు. పోనీ నిన్నటి వరదలకు గోదావరి పరివాహక ప్రాంతం, పోలవరం ముంపు ప్రాంతం పర్యటించి వచ్చినా కూడా జగన్ తరఫు స్పష్టమయిన హామీ లేవీ లేవు. ఈ రెండు సందర్భాల్లో టీడీపీ తరఫున రాజకీయ ఆరోపణల కన్నా క్షేత్ర స్థాయి వాస్తవాల వెల్లడి అన్నది బాగుందన్న వ్యాఖ్య కూడా పరిశీలకుల నుంచి వచ్చింది. ఓ సీఎం స్థాయి వ్యక్తి బేలతనంతో మాట్లాడడమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది.
పోలవరం బాధితుల పరిహారానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని, అంత మొత్తం తాను ఇవ్వలేనని తేల్చేశారు. కానీ ఇదే సందర్భంలో ఒక్క వారం రోజుల నిడివిలోనే జగన్ తన తరఫున కాపు నేస్తం కోసం, జగనన్న తోడు కోసం నిధులు విడుదల చేశారు. వీటి మొత్తం విలువ ఎనిమిది వందల కోట్లకు పైగా.. కానీ పరిహారం విషయమై ఇంతటి కమిట్మెంట్ ఆయనలో లేదని తేలిపోయిందన్న విమర్శలూ వస్తున్నాయి బాధితుల నుంచి ! ఇవీ ఈ ఇద్దరి అగ్ర నేతలకూ ఉన్న తేడాలు.. ఆ పాటి కమిట్మెంట్ ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంటే ఎంతో బాగుంటుందని తరుచూ జగన్ ను ఉద్దేశించి అనేది ఇందుకే అని.. టీడీపీ అంటోంది.