దేవుడి బంగారం భద్రమేనా..? ఆలయాల్లో అభరణాల లెక్కలు సక్రమంగానే ఉన్నాయా..? అర్చకులు అన్ని నగలూ దేవుడికి అలంకరిస్తున్నారా..? నవ్యాంధ్రలో భక్తుల ఆందోళన ఇది. రాష్ట్రంలో దేవుడి ఆభరణాలకు భద్రత కరువైంది. ఆభరణాలపై ఈవోలే కన్నేస్తున్నారు. కొందరు హస్తలాఘవం ప్రదర్శిస్తూ మాయం చేస్తున్నారు. ఇంకొందరు తాకట్టు పెట్టేసి.. దేవుడికి అలంకరించకుండా నాటకాలాడుతున్నారు. అర్చకులు సైతం వారితో చేతులు కలుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ప్రముఖ ప్రాంతాలకు రీజినల్ జాయింట్ కమిషనర్లు(ఆర్జేసీలు)గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు దేవుళ్ల ఆభరణాలు, వెండి వస్తువులపై కన్నేశారు. వీరిలో ఒకరు పదేళ్ల క్రితం కృష్ణా జిల్లా దేవదాయ శాఖ అధికారిగా పని చేశారు. ఆయన భార్యకు.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఉప ఆలయంలో అమ్మవారి హారంపై కన్నుపడింది. అది తనకు కావాలని భర్తను కోరింది. వెంటనే ఆయన అమ్మవారి హారం తెచ్చి భార్యకు ఇచ్చేశారు. ఆమె కొన్నేళ్లు పాటు అమ్మవారి ఆభరణాన్ని వేసుకుని తిరిగింది. ఒకసారి బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి ఆ హారాన్ని వేసుకుని వెళ్లింది. అదే శుభాకార్యానికి నిత్యం అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తుడొకరు వెళ్లారు.
అదికారి భార్య మెడలోని హారం చేశారు. ఇది ఉప ఆలయం అమ్మవారి ఆభరణంగా గుర్తించారు. తర్వాతి రోజు గుడికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియడంతో సదరు అధికారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇంకో అధికారి ఆరేళ్ల కింద శ్రీశైలం మల్లన్నకు ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన వెండి బిందెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. తర్వాతి రోజు సదరు అధికారిపై ఏసీబీ దాడులు చేసింది. వెండి బిందెను గుర్తించిన ఏసీబీ అధికారులు దానిని తిరిగి ఆలయానికి అప్పగించారు.
ఈ మధ్య కాలంలో కాణిపాకంలో కూడా ఓ భక్తుడు సమర్పించిన వెండి ఆభరణాన్ని అక్కడి అధికారి తన ఇంట్లో పెట్టుకున్నారు. ఇలా పలు ఆలయాల్లో బంగారం, వెండి ఆభరణాలు అప్పుడప్పుడూ అదృశ్యమవుతున్నాయి. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. వెలుగులోకి రాకుండా ఎన్ని కోట్ల రూపాయిల ఆభరణాలు కనుమరుగవుతున్నాయో చెప్పలేని పరిస్థితి. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలో ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఆలయంలో నాలుగేళ్ల క్రితం పనిచేసిన ఈవో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త అధికారి వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటికి ఆలయంలో 160 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25 వేల విలువైన వెండి ఆభరణాలున్నాయి.
బదిలీ అయిన ఈవో.. వీటి లెక్కలు మాత్రం కొత్త అధికారికి చెప్పలేదు. పైగా ఆ ఆభరణాలను ఆయనకు అప్పగించలేదు. నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అనేక ఆరోపణలు రావడంతో పాత ఈవో గత నెలలో ఆలయానికి వచ్చి బంగారు, వెండి ఆభరణాలు కొత్త ఈవోకి అప్పగించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ఈవోలు బదిలీ అయ్యే సమయంలోనే కొత్త ఈవోలకు బాధ్యతలు ఇవ్వడంతో పాటు దేవుడి ఆభరణాలకు సంబంధించి లెక్కలు చెప్పి, వాటిని అప్పగించాలి. ఎల్లమ్మ తల్లి ఆలయంలో పాత ఈవో వాటిని అప్పగించలేదు.
ఎక్కడో తాకట్టు పెట్టి.. పీకల మీదకు రావడంతో విడిపించి తెచ్చి అప్పగించినట్లు అర్థమైనా ఆయనపై దేవదాయ శాఖ అధికారులు ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఈవో తప్పు ఎంత ఉందో… అర్చకుల తప్పు కూడా అంతే ఉంది. సాధారణంగా ఆలయాల్లో విగ్రహాలకు ప్రతి రోజూ కొన్ని ఆభరణాలతో ఆలంకరణ చేస్తారు. ఉత్సవాల సమయంలో ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేక ఆభరణాలు ఉంటాయి. మరి ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఉత్సవాలు చేయలేదా..? చేసినా అమ్మవారికి ఆభరణాలు అలంకరించలేదా..? అలంకరణ చేయనప్పుడైనా ప్రధాన అర్చకులకు అనుమానం రావాలి కదా! మరి నాలుగేళ్ల పాటు వాటి ప్రస్తావనే రాలేదంటే దీని వెనుక భారీ మతలబే ఉన్నట్లు లెక్క.
ఆభరణాల లెక్కల్లేవ్…
దేవదాయ శాఖ నిర్వహణలో ఉన్న 8 ప్రధాన ఆలయాలు, మిగిలిన 24 వేల ఆలయాల్లో కొన్ని రూ.లక్షల కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలున్నాయి. కొన్ని ఆలయాల్లో రాజులు సమర్పించిన నగలూ ఉన్నాయి. కానీ వీటి భద్రత విషయంలో మాత్రం దేవదాయ శాఖ అత్యంత నిర్లక్ష్యంగా ఉంటోంది. ఆన్లైన్ రికార్డు సిస్టమ్‌ను ప్రవేశపెడితే తప్ప దేవుడి నగలకు భద్రత ఉండదు. ప్రస్తుతం అవి ఈవోల పర్యవేక్షణలో ఉండడంతో వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు ఆభరణాల లెక్కల్లోనూ తేడాలు వస్తున్నాయి. దేవుడి నగలు లెక్కలు వేయడానికి రాష్ట్రం మొత్తమ్మీద నలుగురే వెరిఫికేషన్ అధికారులు ఉన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఒకరు, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు ఒకరు,. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఒకరు, రాయలసీమ జిల్లాలకు ఒక జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి ఉన్నారు. వీరు ప్రతి ఆలయానికి వెళ్లి అక్కడ అభరణాలు ఎన్ని ఉన్నాయి..? కొలత సరిపోయిందా..? ఏమైనా డ్యామేజ్ అయ్యాయా.. ఇలాఅన్న అన్ని కోణాల్లో పరిశీలించాలి. ఏమైనా తేడాలుంటే కమిషనర్‌కు రిపోర్టు ఇవ్వాలి. అయితే కేవలం నలుగురు అధికారులు 24 వేల ఆలయాలకు ఎప్పుడు వెళ్లాలి, ఎప్పుడు తనిఖీలు చేయాలి. ఇది అసలు సాధ్యమేనా అన్న ఆలోచన కూడా ఉన్నతాధికారులకు రావడం లేదు. చాలా ఆలయాల్లో తనిఖీలు జరుగడం లేదు.