మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన సినిమా.. చిరుత. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయమే సాధించింది. ఐతే ఈ సినిమా తెర వెనుక కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి ఇది రామ్ చరణ్ కోసం అనుకున్న కథ కాదట. అసలు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయాల్సింది కూడా కాదట. పూరి దగ్గర శిష్యరికం చేసి, తర్వాత ‘కంత్రి’ మూవీతో దర్శకుడిగా మారిన మెహర్ రమేషే ఈ కథ రాశాడట. తన దర్శకత్వ అరంగేట్రం కూడా ఈ సినిమాతోనే చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడట. హీరోగా పూరి సోదరుడు సాయిరాం శంకర్‌ను అనుకున్నాడట. అంతే కాదు.. చిత్రీకరణ కూడా మొదలైందట. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోయి.. తర్వాత అదే కథతో చరణ్ హీరోగా పూరి సినిమా తీశాడట. ఈ విషయాన్ని మెహర్ రమేష్ దగ్గర కొన్ని చిత్రాలకు రచయితగా పని చేసిన తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘చిరుత’ కథ మెహర్దే అని.. సాయిరాం శంకర్ హీరోగా అతను ఈ కథతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడని ప్రసాద్ తెలిపారు. అంతే కాక బ్యాంకాక్‌లో ఈ సినిమా ఒక షెడ్యూల్ చిత్రీకరణ కూడా జరిగిందని చెప్పారు. ఐతే తర్వాత అనుకోకుండా బ్యాంకాక్‌లో భారీ వరదలు రావడంతో షూట్ ముందుకు సాగలేదని.. దీంతో సినిమానే ఆగిపోయిందని ప్రసాద్ తెలిపారు. తర్వాత ఈ కథనే తీసుకుని పూరి.. చరణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘చిరుత’ సినిమా తీశారని ఆయన వెల్లడించారు.
ఐతే ‘చిరుత’ కథ మెహర్దని ప్రసాద్ అంటుండగా.. ‘చిరు’ సినిమాకు రచయితగా కూడా పూరి పేరే పడింది. బహుశా తన శిష్యుడి నుంచి బేసిక్ ఐడియా తీసుకుని పూరి దాన్ని పూర్తి స్క్రిప్టుగా చేసుకుని ఉండొచ్చు లేదా.. తన శిష్యుడే కదా అని కథ తీసుకుని తన పేరు వేసుకుని ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ సాయిరాం శంకర్ చేయాల్సిన కథతో చరణ్ అరంగేట్రం చేయడం మాత్రం విశేషమే.