ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉంటున్నాయి. ఇక, మరికొన్ని సినిమాలయితే సమకాలీన సమాజంలోని రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా ఉంటున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలలో డైలాగులు ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేసేలా ఉంటున్నాయి. తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి లీకైన కొన్ని డైలాగులు వైసీపీని టార్గెట్ చేసేలా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
జూలై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై రవితేజతోపాటు ఆయన అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే, విడుదలకు ముందే ఈ సినిమాలో నుంచి కొన్ని డైలాగులున్న సీన్ ఒకటి లీకైంది.
22 సెకన్ల నిడివి గల ఆ సీన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ”రేయ్ మీరు ఎవరో.. ఏ పార్టీయో నాకు అనవసరం… ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం… చెరువులు పూడ్చేస్తాం… అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే… అవుట్ అవుట్” అంటూ మాస్ మహారాజ రవితేజ చెప్పే డైలాగులు ఆయన మాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
అయితే, ఆ వీడియోలో రవితేజ చెప్పిన డైలాగ్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఆ డైలాగ్స్ ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నేతలు, ఏపీ అధికారులు ఈ వీడియో చూస్తే గనుక చిత్ర విడుదలకు అడ్డుపడే అవకాశముందని కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంతవరకు ఈ వీడియోపై వైసీపీ నేతలెవ్వరూ స్పందించలేదు. కాగా, రుషికొండ రిసార్ట్ వ్యవహారంలో కొండను తొలిచేయడంపై హైకోర్టు నేడు విచారణ జరిపిన నేపథ్యంలో ఆ డైలాగులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Leaked Video-#RamaRaoOnDuty ????✊????
వైసీపీ మీకోసమే రాసారు డైలాగ్ Book Your Tickets Tomorrow???? pic.twitter.com/2JHKsArhcz
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) July 28, 2022