జనసేన నాయకుడిగా కండువా కప్పుకొని ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం.. ప్రచారం చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తాజాగా రాయదుర్గంలో కేసు నమోదైంది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై అత్యాచారం(ఐపీసీ సెక్షన్ 376), క్రిమినల్ బెదిరింపులు(ఐపీసీ సెక్షన్ 506), గాయపరచడం(ఐపీసీ సెక్షన్ 323)(2) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఇంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం.. వీటిలో సెక్షన్ 376 నాన్ బెయిలబుల్ కావడం గమనార్హం.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై అనేక అనుమానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ.. యూట్యూబుల్లో వీడియోలు చేయడం.. గీతాలకు నృత్యాలుచేయడం ద్వారా.. జగన్‌ను జానీ టార్గెట్ చేసుకున్నా రు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కుట్ర జరుగుతోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.దీనికి సినీ రంగంలోని వారినే పావులుగా వినియోగిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం. కాగా.. జానీ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అయితే.. ఆయనపై ఏపీలో ఎన్నికలకు ముందు(ప్రచార సమయంలో) సతీష్ అనే డ్యాన్స్ మాస్టర్ కూడా ఇలానే ఫిర్యాదు చేశారు. సతీష్‌కు సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళితో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆయన ప్రోద్బలంతోనే సతీష్ కేసు పెట్టారన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే.. అప్పట్లో ఈ కేసులపై జానీ.. మీడియా ముందుకు వచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. సతీష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతానని కూడా సవాల్ రువ్వారు.
అయితే.. సతీష్ మాత్రం స్పందించలేదు. ఇంతలోనే ఇలా మరో లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. దీంతో అసలు ఏం జరుగుతోంది? అనేది ఆసక్తిగా మారింది. దీనిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. జానీ తప్పు చేసే వ్యక్తి కాదని ఆయనను సమర్థిస్తున్న వారు చెబుతున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై జనసేన పార్టీ కూడా లోతుపాతులను పరిశీలిస్తుండడం గమనార్హం.