వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై వైసీపీ పార్టీ నాయకులే బహరింగంగా విమర్శలు చేయడమే అందుకు నిదర్శనం. తాజాగా పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలు.. ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు తమ మాటలతో జగన్‌ను ఇరకాటంలో పెడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మంత్రివర్గంలో ఈ ఇద్దరూ కీలక శాఖలను నిర్వహించారు. కానీ జగన్ మాత్రం వీళ్లకు తన కేబినేట్లో చోటివ్వని సంగతి తెలిసిందే.
అధికారులదే తప్పు..
వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఒక్కసారిగా సొంత ప్రభుత్వం మీదే ఫైర్ అయ్యారు. అధికారులదే తప్పన్నట్లు మాట్లాడారు. ప్రభుత్వ నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లందరూ ఇప్పుడు నష్టాల్లో ఉన్నారని సిమెంట్, ఐరన్, ఇసుక రేట్లు పెరిగాయని ధర్మాన అన్నారు. ఈ పరిస్థితుల్లో చాలీచాలని రేట్లతో ప్రభుత్వ పనులు చేయమంటే ఎవరైనా చేతులెత్తేస్తారని ఆయన చెప్పడం విశేషం. ప్రభుత్వం నుంచి సిమెంట్ సరఫరా ఆగిపోయిందని ప్రభుత్వ పనులను భుజాలకెత్తుకున్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను కొందరు అధికారులు ప్రభుత్వానికి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పని అంటే కాంట్రాక్టర్లు పారిపోతున్నారన్నారు. అయితే జగన్‌కు అధికారులు తప్పుడు సలహాలివ్వద్దూ అని చెప్పిన ధర్మాన ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రికే చెప్తే సరిపోయేది కదా అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇలా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఆ బాధతో..
ఇక నెల్లూరు నగరంలో పట్టు కోల్పోతున్నామనే బాధతో ఇటీవల మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఆనంద పరోక్షంగా విమర్శించారని టాక్. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాల్లోనూ వివిధ పథకాలకు నిధులు సరిగా విడుదల కావడం లేదని అధికారులు ఏం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు చేశారు. జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణానికి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్మాన, ఆనం ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసి బ్లాక్మెయిల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక గతంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారనే సంగతి తెలిసిందేనని అంటున్నారు. జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి బతకడం సరికాదని రాజకీయ లబ్ధి కోసం ఏం మాట్లాడుతున్నారో తెలీని పరిస్థితిలో ఉన్నారని పెద్దారెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తప్పించుకునే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలున్నాయి. వెంకటరామిరెడ్డి వలంటీర్లు లంచాలు తీసుకునే పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.