దక్షిణాది సినీ చరిత్రలోనే ఇళయరాజా ను మించిన సంగీత దర్శకుడు లేడంటే అతిశయోక్తిగా అనిపించదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు వచ్చారు. కానీ ఇళయరాజాది వాళ్లందరిలో ప్రత్యేక స్థానం. వేలల్లో క్లాసిక్ సాంగ్స్ అందించిన ఆయనకు వీరాభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
కటిక పేదరికం నుంచి వచ్చిన ఇళయరాజా సంగీత దర్శకుడిగా అసామాన్యమైన స్థాయిని అందుకున్న వైనం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ ప్రయాణాన్నే ఇప్పుడు వెండి తెరపైకి తీసుకురాబోతున్నారు. కొన్ని నెలలుగా దీని గురించి జరుగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయి. ఎట్టకేలకు ఇళయరాజా బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. అందరూ అనుకుంటున్నట్లే ఇందులో తమిళ స్టార్ హీరో ధనుష్.. ఇళయరాజా పాత్రను పోషించబోతున్నాడు.
బుధవారం దిగ్గజ నటుడు ఇళయరాజా సమక్షంలో ఈ సినిమా ప్రి లుక్‌ను లాంచ్ చేశారు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. పీకే ప్రైమ్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. ధనుష్‌కు ఇళయరాజా అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన జీవిత కథను వెండితెరపైకి తీసుకురావడానికి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
తన టీంతో కలిసి అతను ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ చేయించాడు. దర్శకుడెవరనే విషయంలో తర్జన భర్జనలు నడిచాయి. చివరికి అరుణ్‌నే అందుకోసం ఎంచుకున్నాడు. ధనుష్ లాంటి గొప్ప నటుడు ఇళయరాజా పాత్ర చేస్తే ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. అతను ఈ పాత్ర కోసం ఎలాంటి మేకోవర్‌లోకి వెళ్తాడన్నది ఆసక్తికరం.