సున్నితమైన అంశాలు.. అందునా తీవ్ర సంచలనంగా మారిన ఉదంతాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో సాదాసీదా వ్యక్తులు చెప్పే మాటలే రికార్డు అవుతున్నప్పుడు.. ఒక రాష్ట్ర పోలీస్ బాస్ చెప్పిన మాటల మాటేమిటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారటమే తెలిసిందే.
ఇలాంటి అంశంలో నిందితుల్ని పట్టుకునే విషయంలో పోలీసు యంత్రాంగం సీరియస్ గా పని చేసినట్లుగా చెప్పటమే కాదు.. నిందితుల్ని గుర్తించేందుకు ఒక ఫోన్ నెంబరును ఏర్పాటు చేశారు. ప్రజలకు తెలిసిన సమాచారాన్ని గుట్టుగా.. గోప్యంగా ఉంచుమాని చెప్పారు. కానీ.. రాష్ట్ర పోలీస్ బాస్ స్థానంలో కూర్చున్న అత్యున్నత అధికారే.. రెండు రోజుల వ్యవధిలో మాట మార్చేయటం.. ఒక దానికి మరొక దానికి పొంతన లేకపోవటం ఒప్పుడు సంచలనంగా మారింది.
రెండు రోజుల క్రితం విగ్రహాల ధ్వంసం కేసులో రాజకీయ కోణం లేదని నొక్కి వక్కాణించిన ఏపీ పోలీస్ బాస్.. తీరా ఇప్పుడు మాత్రం రాజకీయ పార్టీ వ్యక్తుల పాత్ర ఉందని.. పార్టీల పేర్లు చెప్పేసిన తీరు చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. ఇంతకీ.. ఈ రెండు రోజుల్లో ఏమైంది? పోలీస్ బాస్ మాటల్లో మార్పు ఎందుకు వచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. కేవలం రెండు రోజుల వ్యవధిలో తన మాటలో వచ్చిన మార్పు ఎందుకన్న విషయం మీద మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పాలి.
ఏపీలోని దేవతా మూర్తుల ధ్వంసం కేసుకు సంబంధించి భోగి రోజున ఏపీ పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పిన మాటలకు.. కనుమ రోజు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల దర్యాప్తుపై కొత్త తరహా సందేహాలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ భోగి రోజున ఏపీ డీజీపీ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. ‘‘ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇప్పటి వరకూ ఛేదించిన 29 కేసుల్లో కుట్రకోణం కనిపించ లేదు. దొంగలు, గుప్తనిధుల వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, మతిస్థిమితం లేని వారు, అడవి జంతువుల కారణంగానే ఆయా ఘటనలు జరిగినట్లు గుర్తించాం’’ అని పేర్కొన్నారు.
అదే డీజీపీ రెండు రోజుల తర్వాత కనుమ వేళ కూడా మాట్లాడారు. తాజాగా డీజీపీ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పాత్ర ఉంది. 9 కేసుల్లో వారి పాత్రపై ఆధారాలు సేకరించాం. అందులో 15 మందిని అరెస్టు చేశాం. వీరిలో 13 మంది ఒక పార్టీకి, ఇద్దరు మరో పార్టీకి చెందిన వారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. రెండు రోజులకే మారిపోయిన ఆయన మాటల్ని చూసినప్పుడు ఏమనుకోవాలి? ఏలా రియాక్టు కావాలి?