జీవితంలో స్నేహం అనేది ఒక మధుర జ్ఞాపకం. తోబుట్టువులకన్నా స్నేహితులు, మిత్రులతో జీవితంలో అనుబంధం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు జీవితంలో అత్యున్నత పదవులు అధిరోహించడం అరుదుగా జరుగుతుంటుంది. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్న వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, పాండిచ్చేరి డీజీపీ శ్రీనివాస్ లు ఇద్దరూ అరుదైన ఘనత సాధించారు.
ద్వారకా తిరుమలరావు, శ్రీనివాస్ లు ఇద్దరూ గుంటూరులోని క్రిష్ణా నగర్ ప్రాధమిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదుకున్నారు. ఆ తర్వాత పదో తరగతి పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిజి అభ్యసించారు. ద్వారకా తిరుమల రావు ఆ తర్వాత సివిల్స్ రాసి 1989లో ఏపి కేడర్ కే ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలలో ఎస్పీగా సేవలందించారు. విభజన ఏపిలో విజయవాడ కమీషనర్ గా పనిచేసిన ద్వారకా తిరులరావును ప్రస్తుతం డిజిపి పదవి వరించింది.
ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ తండ్రి ఉద్యోగరీత్యా గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ తిరుమల రావుతో కలిసే చదువుకున్నారు. శ్రీనివాస్ 1990లో ఐపిఎస్ గా జమ్మూ కాశ్మీర్ క్యాడర్ కు ఎంపికయ్యారు. గత ఏడాది ఆయన పాండిచ్చేరి డిజిపిగా బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటికీ గుంటూరులో తాము చదువుకున్న పాఠశాలకు వచ్చిపోతుంటారు.
తమతో చదువుకున్న తమ స్నేహితులు ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు డిజిపిలుగా ఎంపిక కావడంతో వారి పాఠశాల మితృల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారిద్దరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి సన్మానించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బహూషా దేశంలో ఇద్దరు స్నేహితులు ఒకేసారి డీజీపీలుగా పనిచేయడం ఇదే మొదటిసారి కావచ్చు.