వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి గతంలో హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ అవుతానని, తన వాదనలు కూడా వినాలని ఆమె కోరారు. శివ శంకర్ రెడ్డితోపాటు వివేకా కేసులో జైల్లో ఉన్న ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్ల కోసం కడప కోర్టును, హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
అయితే, వారికి బెయిల్ వస్తే బయటకు వెళ్లి సాక్ష్యాలను, సాక్షులను తారు మారు చేసే అవకాశముందని, అందుకే వారికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. దీంతో, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శివ శంకర్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు…శివ శంకర్ రెడ్డికి షాకిచ్చింది.
ఆయన బెయిల్ పిటిషన్ ను దేశపు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారంనాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు… హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అంతేకాదు, శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి తగిన కారణాలేమీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో, సుప్రీం కోర్టులోనూ శివ శంకర్ రెడ్డికి చుక్కెదురైనట్లయింది.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డిపేరు కూడా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అవినాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డి పేరు చార్జిషీట్ లో చేరేందుకు కూడా చాలా సమయం పట్టిన విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని వివేకా మర్డర్ కేసులో ఐదో నిందితుడిగా చేర్చడానికి సీబీఐ ప్రహసనం చేయాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైల్లో ఉంటున్న శివశంకర్ రెడ్డిపై సీబీఐ గతంలో చార్జిషీట్ దాఖలు చేసింది. వివేకా డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన సమాచారంతోనే శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.