వైసీపీ హయాంలోనే ఏపీకి జీవనాడివంటి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆ పార్టీ నేతలు గొప్పలు పోయిన సంగతి తెలిసిందే. జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నోసార్లు ధీమా వ్యక్తం చేశారు. కానీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ప్రచార ఆర్భాటం మినహా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా జగన్ చేసింది గోరంత చేయాల్సింది కొండంత అన్న విమర్శలు వస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు సంగతి పక్కన పెడితే రాష్ట్రంలోని పలు గ్రామాలలో ప్రజలకు కనీసం తాగునీటి సౌకర్యం లేని దుస్థితి జగన్ పాలనలో ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యపై సీఎం జగన్ కు ఉమ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామాలలో తాగేందుకు మంచినీరు లేని దుస్థితి ఏర్పడిందని ఉమ ఫైర్ అయ్యారు.
అంతేకాదు, పారిశుధ్యం, మౌలిక వసతులు కల్పన అధ్వాన్నంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. మైలవరం పట్టణంతో పాటు కొండపల్లి మున్సిపాలిటీలలో తాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వేసవిలో గొంతు ఎండిపోయి ఇక్కట్ల పాలవుతున్నారని ఉమ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను జగన్ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు దోచుకోవడంపై జగన్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచినీళ్లు అందించడంలో లేదని విమర్శలు గుప్పించారు.
గతంలో టీడీపీ నేత నారా లోకేష్ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్ కు వైసీపీ నేతలెవరూ సమాధానం ఇవ్వలేదు. మరి, ఈ నేపథ్యంలో తాజాగా దేవినేని ఉమా విసిరిన సెల్ఫీ ఛాలెంజ్ కు జగన్ లేదా వైసీపీ నేతలు స్పందిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.