అక్రమ మైనింగ్ ను పరిశీలించి వస్తున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి చేసిన ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సింది పోయి…. ఉమను అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్ కు పంపడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలని ఉమ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఉమ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు నేడు వాదనలు కూడా ప్రారంభించింది.
అయితే, ఈ కేసులో స్టేషన్ రికార్డులను కోర్టుకు పోలీసులు సమర్పించలేదు. స్టేషన్ నుంచి రికార్డులు తెప్పించాలని ఉమ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, ఆ అభ్యర్ధనను అంగీకరించని హైకోర్టు…ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఉమ బెయిల్ పిటిషన్ పై విచారణను ఆగస్టు 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. శని, ఆదివారాలు సెలవులు కావడం, సోమవారం ఆల్రెడీ స్వీకరించిన పిటిషన్లు పెండింగ్ లో ఉండడంతో ఉమ బెయిల్ పిటిషన్ పై విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
మరోవైపు, ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ కోర్టులో డీఎస్పీ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపులతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉమను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడడంతో ఉమను కస్టడీలోకి తీసుకొని ఉమ నుంచి..రాబోయే రెండు, మూడు రోజుల్లో మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.