టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టార్గెట్గా సీఐడీ అధికారులు పావులు కదుపుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం జగన్ కు సంబంధించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్మీట్లో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం నమోదు చేశారు.
ఈ క్రమంలో ప్రెస్మీట్లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. ఏ శాఖ అధికారులైనా.. నోటీసులు ఇచ్చిన తర్వాత స్పందించేందుకు కనీసం 72 గంటల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. కేసు తీవ్రతను బట్టి.. ఆయా సమయాల్లో మార్పు ఉంటుందని భావించినా.. దేవినేని ఉమా పై నమోదైన కేసు విషయంలో ఇంత హడావుడిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ, సీఐడీ పోలీసులు మాత్రం తీవ్ర వివాదాస్పద నిర్ణయాల దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ నెల 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు కేవలం 10 నిముషాల్లో కర్నూలులోని సీఐడీ ఆఫీస్కు వచ్చి కలవాలని ఆదేశించారు. అయితే. దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు. దీనిపై స్పందించని సీఐడీ.. తాజాగా మరోసారి నోటీసులు ఆయనకు విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న నివాసానికి నోటీసులు అంటించారు. దీనిలో కేవలం 48 గంటల సమయం ఇచ్చారు. ఈ నెల 19న ఉదయం 10.30గంటలకు వచ్చి ఆఫీస్లో హాజరుకావాలని పేర్కొన్నారు.
ఇప్పుడు ఇది రెండో నోటీసు. అంటే.. మరో నోటీసు ఇచ్చేస్తే.. ఇక, దేవినేని ఉమా.. వివరణతో సంబంధం లేకుండానే సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసే అధికారం ఉంటుంది. ఇదంతా పరిశీలిస్తున్న రాజకీయ నిపుణులు ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే జరుగుతోందని అంటున్నారు. అయితే.. న్యాయస్థానాల్లో మాత్రం సీఐడీకి మొట్టికాయలు తప్పవని చెబుతున్నారు.