మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సంచలన పరిణామం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చాలా కాలం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయడం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయనను హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి తరలించారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ పులివెందుల నుంచి హైదరాబాద్ కు భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చిన సిబిఐ అధికారులు ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భాస్కర్ రెడ్డికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి 10 రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమా స్పందించారు.
నాలుగేళ్లుగా ముద్దాయిని కాపాడిన జగన్ అసెంబ్లీలో ఒక మాట…బయట మరొక మాట అనే వేదాంతం చెప్పి ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. వివేకా కేసులో ముద్దాయిల అరెస్టుపై జగన్ స్పందించాలని, నోరు తెరవాలని ఉమా డిమాండ్ చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై సజ్జలతో పాటు బూతుల మంత్రి కొడాలి నాని కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో బాధ్యత వహిస్తూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని ఉమా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం నడవదని ఆయన పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు.