కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేసేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఉమపై ఎస్సీ,ఎస్టీ యాక్ట్ తో పాటు పలు కేసులు నమోదు చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి దేవినేని ఉమ బెయిల్ పై విడుదలయ్యారు.
తనపై దాడి జరిగిన తర్వాత ఉమ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై దేవినేని ఉమ మండిపడ్డారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, ఏపీ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా భయపడేది లేదని ఉమ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తోపాటు చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పారని ఉమ అన్నారు.
అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నందుకు తనను అక్రమంగా అరెస్టు చేశారని, తనపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు 2కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని ఉమ వెల్లడించారు. తనపై దాడి జరిగిన సమయంలో 8 గంటలపాటు తాను కారు నుంచి బయటకు రాలేదని చెప్పారు. మైనింగ్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తుంటే దాడులు చేసి తప్పుడు కేసులు పెడుతున్నారని ఉమ మండిపడ్డారు. రాష్ట్రంలో న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని, ధర్మాన్ని కాపాడుతున్నాయని అన్నారు. మరోవైపు, ఉమను కస్టడీలోకి ఇవ్వాలని విజయవాడ పోలీసులు కోరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై కోర్టు తర్వాత విచారణ చేపడతానని వెల్లడించింది.