పార్టీలు వేరైనా.. నాయకులు ప్రజల కోసం కలిసిమెలిసి పనిచేసిన నాయకులు పుట్టిన గడ్డగా కృష్నాజిల్లా పేరు తెచ్చుకుంది. ఎన్నికల వరకే రాజకీయాలు.. అవి కూడా వ్యక్తిగత దూషణలు.. వ్యక్తిగత సవాళ్లు ఎంత మాత్రం కావు. కేవలం రాజకీయాలను రాజకీయంగా మాత్రమే చూసిన వారు కృష్ణాలో కోకొల్లలుగా ఉన్నారు. గుడివాడలో శోభనాద్రి చౌదరి నుంచి నందమూరి తారక రామారావు వరకు, కైకలూరులో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నుంచి జగ్గయ్య పేటలో నెట్టెం రఘురామ్ వరకు, విజయవాడ తూర్పులో దేవినేని నెహ్రూ సహా అనేక మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. టీడీపీ తరఫున బరిలో దిగగా.. అదేసమయంలో పర్వతనేని ఉపేంద్ర వంటి రాజకీయ దిగ్గజాలు.. కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.
అయితే.. ఎవరూ ఎవరిపైనా వ్యక్తిగత కక్షలతో పోరాడుకున్న పరిస్థితి జిల్లాలో ఎన్నడూ లేదు. రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేసుకుని ముందుకు సాగారు. అంతేకాదు.. గతంలో జరిగిన ఒక ఉదాహరణ చూస్తే.. రాజకీయాలు ఇలా ఉంటాయా? అని అనిపిస్తుంది. పర్వతనేని ఉపేంద్ర విజయవాడ ఎంపీ(కాంగ్రెస్)గా ఉన్నారు. ఈ క్రమంలో అప్పటి కంకిపాడు (ప్రస్తుతం విజయవాడ తూర్పు) నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున దేవినేని నెహ్రూ విజయం సాధించారు. ఈ క్రమంలో తన నియోజకవర్గంలో కేంద్ర నిధులతో రోడ్లు వేయించాల్సి వచ్చినప్పుడు స్వయంగా దేవినేని…. ఉపేంద్ర కార్యాలయానికి వెళ్లి వివరిస్తే.. ఆయన ఆ విషయాన్ని పార్లమెంటులో ప్రస్థావించి.. నిధులు విడుదల చేయించుకున్నారు.
కలిసిమెలిసి పనిచేసుకున్నారు. ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీ.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారు. ఓడిపోయి నా.. కూడా పరస్పరం గౌరవంగా ఉండేవారు. నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రెబల్ స్టార్.. కృష్ణంరాజు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు కనుమూరి బాపిరాజును ఓడించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. పార్లమెంటు లో ఏదో పనిపై బాపిరాజు ఢిల్లీ వెళ్తే.. బాపిరాజును స్వయంగా తన కారులో తీసుకుని పార్లమెంటు వెళ్లారు కృష్ణంరాజు. ఇద్దరూ పరస్పరం భిన్నధ్రువాలకు చెందిన పార్టీల నాయకులు. అందునా ఒక నియోజకవర్గంలో పోటీ చేసినవారు. కానీ.. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేశారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. నేడు ఆ తరహా స్ఫూర్తి నాయకుల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తాజా రగడలో మాజీ మంత్రి దేవినేని ఉమాను.. మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఎవరూ కూడా హర్షించలేక పోతున్నారు. పార్టీలకు అతీతంగా నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే.. వ్యక్తిగతంగా నాలుగు గోడల మధ్య అరెయ్-ఒరెయ్ అనుకుంటే.. అది వేరే సంగతి .. కానీ.. నాని.. మరీ బరితెగించినట్టుగా చంద్రబాబును, ఉమాను కూడా మాట్లాడడాన్ని ఎవరూ సహించడం లేదు. “ఇవా రాజకీయాలు?! బాబోయ్!!“ అని దుమ్మెత్తి పోస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్నగారి ఆత్మగౌరవ నినాదం ప్రతిధ్వనించిన గుడివాడ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తూ.. అన్నగారిని కొనియాడుతున్న నాని.. ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం.. మన పరువును మనమే తీసుకోవడం సరికాదని సూచిస్తున్నారు.