మాజీ మంత్రి దేవినేని ఉమపై ఏపీ సర్కార్ అక్రమ కేసు బనాయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, అందుకే, ఉమపై దాడి చేయించిన వైసీపీ నేతలను వదిలేసి…ఉమపైనే తప్పుడు కేసులు పెట్టించారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ హైకోర్టులో దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పోలీస్స్టేషన్లో తనపై దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరారు. తనపై కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, కానీ, ఈ సెక్షన్లకు ఎటువంటి ఆధారాలు లేవని ఉమ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అంతేకాదు, ఉమపైనే దాడి చేసింది కాక ఆయనపైనే కేసులు బనాయించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన పలు సాంకేతిక ఆధారాలను హైకోర్టుకు సమర్పించారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత ఉమ బెయిల్ పిటిషన్ను ఏపీ హఐకోర్టు అడ్మిట్ చేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్ మరో రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని ఉమ తరఫు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ దాసరి సురేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రకారం ఉమతోపాటు మరో 17 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ, ఉమపై దాడి ఘటనలో వైసీపీకి చెందిన ఆరుగురిపై కేసులు పెట్టామని చెబుతున్నప్పటికీ…వారి పేర్లను వెల్లడించలేదు.