డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ కావడంపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్ణయంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలో నిరసన చేపట్టిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు.
యూనివర్సిటీ పేరు మార్పునకు వ్యతిరేకంగా విజయవాడలో దేవినేని ఉమతోపాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. గొల్లపూడిలోని ఎన్టీఆర్ సర్కిల్లో కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో, పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది.
పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దేవినేని ఉమను భవానీపురం పీఎస్ కు తరలించారు. ఇతర కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం వైపు తరలించారు. హెల్త్ యూనివర్సిటీ ఆలోచన చేసిందే ఎన్టీఆర్ అని, అలాంటి అన్నగారి పేరు తొలగించడం దారుణమని ఉమ అభిప్రాయపడ్డారు. పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోకుంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
దేవినేని ఉమ అరెస్టుతో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్యాయంగా ఉమను అరెస్టు చేశారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు, ఎన్టీఆర్ వర్సిటీ దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ నిరసన తెలిపేందుకు వస్తున్న పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.