రెండు రోజులుగా తెలుగు సినిమా ప్రియుల చర్చలన్నీ దేవర సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. ముందు అనుకున్నట్లుగా ఏప్రిల్ 5న రాదని.. వాయిదా పడుతోందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ముందు ఇవి కేవలం ఊహాగానాలే అనుకున్నారు కానీ.. తాజా సమాచారం ప్రకారం వాయిదా వార్త నిజమే అని తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవరను వేసవి రేసు నుంచి తప్పించినట్లు సమాచారం.
ఏప్రిల్ 5నే తమ సినిమాని రిలీజ్ చేయాలని టైట్ షెడ్యూల్స్ మధ్య పనిచేస్తున్న దేవర టీంకు.. విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ కు సెట్లో జరిగిన ప్రమాదం పెద్ద షాక్. గాయపడ్డ సైఫ్ కానీ కొన్ని వారాలు పాటు షూటింగ్ కు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో షెడ్యూల్ తలకిందులు అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద కూడా ఈ ప్రభావం పడేలా ఉండడంతో సినిమాను వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. దేవర పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమా.
ఇలాంటి సినిమా విషయంలో క్వాలిటీ పరంగా రాజీ పడినా, హడావుడి చేసినా అవుట్ పుట్ తేడా కొడుతుంది. ఎన్టీఆర్, కొరటాల… ఈ ఇద్దరికీ ఈ సినిమా చాలా కీలకంగా కావడంతో కాస్త ఆగి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడం మంచిదని ఫిక్స్ అయ్యారట. అనేక అనేక వెరిఫైడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దేవర వాయిదా గురించి వార్తలు వస్తున్నా చిత్ర బృందం నుంచి ఖండన లేకపోవడంతో ఈ సినిమా ఏప్రిల్ 5న రాదని ఫిక్స్ అయిపోవచ్చు.