వైసీపీకి 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతోపాటు పోలవరం నిధులు తీసుకువస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం అయిన మరు నిమిషమే కేంద్రం మెడలు వంచాల్సిన జగన్…ప్రధాని మోడీకి వంగివంగి దండాలు పెడుతూ ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే పోలవరం పనులు అటకెక్కాయి. తాను సీఎం అయిన మూడేళ్లలోపు పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన జగన్…ఇపుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బహిరంగ లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నలు సంధిస్తూ జగన్ కు రామానాయుడు రాసిన లేఖ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు దమ్ముంటే ఆ 21 ప్రశ్నలపై సమాధానం చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. పోలవరానికి జగన్ శనిలా దాపురించారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేసి ప్రజలను నట్టేట ముంచేశారని మండిపడ్డారు. విధ్వంసం, విద్రోహం, చంపడం వంటివి జగన్ బ్లడ్ లోనే ఉన్నాయని చురకలంటించారు.
జగన్ అసమర్థ పాలన చూసిన తర్వాత 2030 నాటికైనా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. వైసీపీ నేతల కమీషన్ల కక్కుర్తి వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి చంద్రబాబు హయాంలో అవార్డులు వచ్చాయని, కానీ, జగన్ హయాంలో చివాట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. పోలవరం ఎందుకు నిషేధం ప్రాంతంగా మార్చారో సమాధానం చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు.