రాజకీయ నేతలు వేసే అడుగులు ఒక్కొక్క సారి ఒక్కొక్క విధంగా ఉంటాయి. తమకు అందితే జుట్టు.. అందకపోతే.. చేతులు అన్నట్టుగా.. వ్యవహరిస్తుంటారు. ఎన్నికల సమయంలోనూ అంతే! ఇప్పుడు తాజాగా రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వ్యవహారం కూడా ఇలానే ఉందని అంటున్నారునెటిజన్లు.
ఆయన తాజాగా చేసిన ఓ డిమాండ్‌పై నెటిజన్లు నవ్వులు రువ్వుతున్నారు. “ఏంటి సార్ మీ స్థాయికి ఈ డిమాండ్ ఏంటి?“… “ఆ మాత్రానికి ఎన్నికలు ఎందుకు సారు.. మీరే దున్నేయొచ్చుగా“ అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో కోన రఘుపతి వ్యవహారం ఆసక్తిగా మారింది.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో మునిసిపాలిటీలు.. పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలో బాపట్ల మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతు న్నాయి. ఇక్కడ టీడీపీ బలమైన పోరు సాగిస్తోంది. పార్టీకి కీలకమైన నాయకులు ఉన్నారు. బాపట్ల టీడీపీ ఇంచార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ, బాపట్ల పార్లమెంటు ఇంచార్జ్, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు బలంగా ఉన్నారు. కేడర్ మొత్తాన్ని బలంగా ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ పాగా వేయడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
బహుశ ఈ విషయాన్ని గ్రహించారో ఏమో.. కోన రఘుపతి.. నేరుగా యుద్ధం చేసేందుకు మనసు రాకో.. లేక కేడర్లేకో తెలియదు కానీ.. ఏకగ్రీవాలు చేయాలంటూ.. ప్రజలకు, పార్టీలకు వినతలు పంపారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 34 వార్డులను వైసీపీకి ఏకగ్రీవం చేయాలంటూ.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. ఈ కౌన్సిలర్లను ఏకగ్రీవం చేసి.. ముఖ్యమంత్రి జగన్‌కు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తద్వారా.. బాపట్ల జిల్లాను సాధించుకోవచ్చనే సెంటిమెంటును కూడా రగిలించారు. “ఎన్నికల ప్రక్రియ ముగియగానే.. జిల్లాల ప్రకటన ఉంటుంది.. సో.. వైసీపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేయండి“ అని కోన వారు.. సూచించారు.
అదేసమయంలో పార్టీలకు కూడా ఆయన విన్నపాలు చేశారు. మనందరం ఒకటే.. పోటీ వద్దు.. వైసీపీకి మద్దతివ్వడం .. ద్వారా బాపట్ల జిల్లాను సాధించుకుందాం.. అన్నారు. గతంలో టీడీపీ నేతలు కూడా మద్దతిస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. కోన వారి వినతులు.. సీరియస్‌గా కంటే.. జోక్‌గా మారాయని అంటున్నారు నెటిజన్లు. ఈ మాత్రం దానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం ఎందుకు.. ఎన్నికలు ఎందుకు.. ఇంత పెద్ద ఖర్చుఎందుకు.. అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవాల విషయంలో కొందరు ఘాటుగా ఉంటే.. కోనవారు సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారని నిష్టూరాలు కూడా ఆడుతున్నారు. మరి ఆయన ఏం చెబుతారో చూడాలి.