వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టమని జగన్ చేసిన కామెంట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఐపీఎస్ అధికారులను బెదిరించినా..వారిపై చిన్న గాటుపడ్డా సుమోటోగా కేసు పెడతామని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
తమది మంచి ప్రభుత్వమేగానీ, మెతక ప్రభుత్వం కాదని చెప్పారు. గతంలో అధికారులను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని పవన్ ఆరోపించారు. వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమని, కానీ, పరిమితులు దాటి కుటుంబాలు, మహిళలను దూషించడం సరికాదని అన్నారు. డబ్బు, క్రిమినల్స్ సపోర్ట్ ఉందని బెదిరిస్తే భయపడేందుకు ఎవరూ లేరని పవన్ చెప్పారు. ఇతరులను తిట్టే ముందు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలని అన్నారు.
గుంటూరు అరణ్య భవన్ లో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటవీ శాఖలోని అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. అటవీ శాఖల బ్లాక్ లకు అమరుల పేర్లు పెట్టాలని పవన్ సూచించారు.