సినీమా రంగంలో ఉన్నవారికి సెంటిమెంట్లు ఇంపార్టెంట్. సినిమా షూటింగులకు కొబ్బరికాయ కొట్టడం నుంచి రిలీజ్ వరకు అందరూ సెంటిమెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే సినీ రంగం నుంచి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సెంటిమెంట్లను నమ్ముకున్నట్టుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్.. ఏం చేసినా.. ముహూర్తాలు.. సెంటిమెంట్లు వాస్తు చూసుకుంటు న్నారన్న టాక్ అయితే జోరుగా వినిపిస్తోంది.
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. చంద్రబాబు ఆయనకు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని క్యాంపు ఆఫీసుగా కేటాయించారు. అప్పటికప్పుడు రూ. కోటి ఖర్చు చేసి అధునాతన ఫర్మిచర్ కూడా కొనుగోలు చేయించారు. మూడు మాసాల పాటు అక్కడే పవన్ కల్యాణ్ పనిచేశారు. సమీక్షలు, సమావేశాలు చేపట్టారు. తనను కలిసేందుకు ఎవరైనా వచ్చినా.. ఆయన అక్కడే భేటీ అయ్యారు. అయితే.. ఇంతలోనే ఆయన అనుబాంబు లాంటి వార్త తెలిసిందట.!
“ఈ ఇరిగేషన్ కార్యాలయం అచ్చి రాదు. అనేక మంది నాయకులు ఈ కార్యాలయాన్ని వినియోగించిన తర్వాత.. ప్రజలకు దూరమయ్యారు“ అని అయిన వారు.. సొంత పార్టీ నేతలు కూడా పవన్ కల్యాణ్ చెవిలో ఊదారని సమాచారం. దీనికి వారు కొన్ని ఉదాహరణలు కూడా చూపించారట. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మాజీ అనిల్ కుమార్ యాదవ్ సహా.. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వంటివారు వారి హయాంలో ఈ కార్యాలయాన్నే వినియోగించారని.. వారంతా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని తెలిసిందట.
దీంతో అంతర్మథనంలో పడిన పవన్.. తనకు పరిచయం ఉన్న పురోహితులతో అసలు విషయం తెలుసుకున్నార ట. వారు కూడా.. “ఔను ఇది మంచిది కాదు“ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో క్షణ కాలం కూడా ఆలోచించకుం డా.. సదరు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబుకు అప్పగించేసి,.. అక్కడకు నేను వెళ్లను.. అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. మంగళగిరిలోని కార్యాలయంలోనే తన పనులు చేసుకుంటానని కూడా ఆయన వెల్లడించేశారట. మొదట్లో విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే పవన్ వద్దనుకున్నారని చర్చ సాగింది. కానీ, తర్వాత అసలు సెంటిమెంటు వెలుగు చూసింది.