తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వాడారన్న ఆరెోపణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దేవుడా మమ్మల్ని క్షమించు అంటూ పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. విచ్చలవిడి మనస్తత్వం ఉన్నవాళ్లే లడ్డూ కల్తీకి తెగబడగలరని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజా పోరాటంలో ఉన్న తన దృష్టికి లడ్డూ అంశం రాక పోవడం బాధ కలిగించిందని, లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి పట్ల ఇది నిజంగా ఘోర అపచారం అని, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ దీనికి ప్రాయశ్చితం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అందుకే, తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ ప్రకటించారు. గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో సెప్టెంబరు 22న దీక్ష ప్రారంభిస్తానని, 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులు గత రాక్షస పాలకులకు భయపడి, ఇటువంటి తప్పిదాలపై మౌనంగా ఉన్నారేమో అనిపిస్తోందని పవన్ తెలిపారు.