ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అటవీ శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో భేటీఅయ్యారు. ఈ సమయంలో అటవీ పరరక్షణ, దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన వారితో చర్చించారు. ముఖ్యంగా ఏపీలోని శేషాచలం అడవులను రక్షించుకోవాల్సి ఉందని.. దీనికి తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని తెలిపారు.
మరీ ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ఉత్పత్తి ఎక్కువగా ఉందని.. కానీ, దీనిని అడ్డా చేసుకుని స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని.. దీనికి అడ్డుకట్ట వేయాల్సి ఉందని అన్నారు. దీనికి కర్ణాటక సర్కారు సాయాన్ని తాము కోరుతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఎర్రచందనం, అడవీ ఉత్పత్తుల స్మగ్లింగ్‌ను ఆయన ప్రస్తావించారు.
దీనికి సినిమాలకు లింకు పెట్టారు. “40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడు.. కానీ, ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు.. ఇది ప్రస్తుత మన సినిమా పరిస్థితి“ అని పవన్ కల్యాణ్ అన్నారు. తాను కూడా సినీమా హీరోనేనని ఆయన చమత్కరించారు. పిఠాపురం నుంచి ప్రజలు తనను ఎన్నుకున్నారని.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నానని చెప్పారు. అయితే.. ఇలా అడవులు-స్మగ్లింగును ముడిపెట్టి సినిమాలపై చేసిన వ్యాఖ్యలు.. `పుష్ప` సినిమా గురించేనన్న చర్చ జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.