ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులకు సీఎం జగన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ కొత్తగా మంత్రి పదవులు దక్కించుకునేవారికి సీఎం జగన్ హిట్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో, పాత కేబినెట్ లోని చాలామంది మంత్రులు తమ అసహనాన్ని నానా రకాలుగా వెళ్లగక్కుతున్నారు. నలుగురు మినహా మిగిలిన మంత్రులందరికీ ఉద్వాసన తప్పదన్న వార్తల నేపథ్యంలో కొందరు మంత్రులు మింగలేక..కక్కలేక చేస్తున్న కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
ఈ క్రమంలోనే ఏపీ అబ్కారీ శాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంత్రి పదవి నుంచి తీసేస్తే హాయిగా ఉంటుందని నారాయణ స్వామి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. మంత్రి పదవి పోయినా తామేమీ బాధపడబోమని, తామేమీ అవినీతికి పాల్పడలేదని ఆయన అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి. పైగా, ముందుగా చెప్పిన విధంగానే కేబినెట్‌ను జగన్ మారుస్తున్నారం టూ నారాయణ స్వామి తన అసహనాన్ని వెళ్లగక్కడం చర్చకు దారి తీసింది.
అయితే, మంత్రి పదవి గురించి నారాయణ స్వామి గతంలోనూ ఇదే తరహాలో షాకింగ్ కామెంట్లు చేశారు. నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని, తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని అడిగిన వారికి, అడగని వారికి, మీడియా సమావేశాల్లో ఇదే పాట పాడుతున్నారని ప్రచారం జరిగింది. తనపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయకపోయినప్పటికీ తాను నిజాయితీపరుడినని చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. మైనారిటీల మీద నారాయణ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రోజాతో విభేదాలు వంటి పలు కారణాల నేపథ్యంలో ఆయనపై వేటు తప్పదని అనుకుంటున్నారు.
ఇక, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తమ మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అని మంత్రులు ఆలోచిస్తుంటే…ఖాళీ అయ్యే బెర్తుల్లో తమకు చాన్స్ వస్తుందా అని ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే తన మంత్రి పదవి ఉంచాలంటూ డిప్యూటీ సీఎం ఒకరు ఏకంగా జగన్ కాళ్ల మీద పడ్డారని రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తనను కొనసాగించాలంటూ ఓ మంత్రి ఏకంగా జగన్ ముందు సాష్టాంగపడ్డారని టాక్ వస్తోంది. కాళ్ల మీద పడినప్పటికీ, ఆ సీనియర్ నేతను జగన్ కనికరిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.