ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం…సరిపడినన్న డోసులు లేకపోవడం కూడా కేసులు పెరగడానికి ఒక కారణం. అయితే, కొన్ని వ్యాక్సిన్ లు తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదన్నది మరో వాదన.
ఈ క్రమంలోనే ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ రూపొందించిన అస్త్రజెనకా టీకాపై కొన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుంటే రక్తం గడ్డగడుతుందని పలు నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో యూరప్ లోని కొన్ని దేశాలు ఆ టీకాపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆస్ట్రాజెనెకా టీకాపై ఐరోపా మెడికల్ ఏజెన్సీ నివేదిక తర్వాత తాత్కాలికంగా నిలిపివేసిన దేశాలు మరలా ఆస్ట్రాజెనెకాను వినియోగిస్తున్నాయి.
కానీ, ఐరోపా దేశమైన డెన్మార్క్ మాత్రం ఆక్స్ ఫర్డ్ టీకా ఆస్ట్రాజెనెకాపై శాశ్వత నిషేధం విధించింది. ఆ టీకా పనితీరు, దుష్ప్రభావాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించిన డెన్మార్క్…ఆ దర్యాప్తు అనంతరం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రాజెనెకా టీకా లేకుండానే ముందుకు సాగుతామని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా టీకాలను డెన్మార్క్ లో వినియోగిస్తున్నారు.