ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా మారింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం.. అసలే మాత్రం సంబంధం లేని వారికి కొత్త టెన్షన్ ను తెప్పించటమే కాదు.. తమ పరిస్థితేమిటన్న ఆందోళనకు గురవుతున్నారు. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను.. చెరువు ఎఫ్ టీఎల్ లోనూ.. బఫర్ జోన్ లోనూ నిర్మించటం.. అక్రమ నిర్మాణం కావటంతో హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేతలు షురూ చేయటం.. ఐదు గంటల వ్యవధిలో నేలమట్టం చేయటం తెలిసిందే.
అయితే.. ప్రస్తుతం శ్రావణమాసం కావటం.. రానున్న వారంలో మూడు పెళ్లిళ్ల వరకు ఎన్ కన్వెన్షన్ లో చేసుకునేందుకు వీలుగా బుకింగ్ లు చేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో.. సదరు పెళ్లి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే పెళ్లి పత్రికలు అచ్చేసి.. అందరికి పంచేసిన తర్వాత పెళ్లి వేదికను కూల్చేసిన పరిస్థితుల్లో పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? అన్నది పెద్ద తలనొప్పిగా మారింది.
ఇప్పటికిప్పుడు అంత భారీగా.. పెద్దదైన కన్వెన్షన్ సెంటర్ ను ఎక్కడ వెతకాలి? ఎక్కడ బుక్ చేయాలి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికిప్పుడు అంటే.. దొరికే అవకాశం లేదని.. ఈ కూల్చివేత ప్రభావం దాంతో ఏ మాత్రం సంబంధం లేని తమపై తీవ్రంగా పడుతుందని.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను బుక్ చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాస్త గ్యాప్ ఉన్నా బాగుండేదని.. అలాంటిదేమీ లేకుండా ఉరుము మెరుపు లేకుండా కూల్చేసిన వైనంతో పెళ్లిళ్ల కోసం బుక్ చేసుకున్న వారంతా షాక్ లో ఉన్నారు. వీరి ఇబ్బందిపై పలువురు అయ్యో అనే పరిస్థితి.