కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడిచిన రెండేళ్లుగా ఎంతలా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. చూస్తుండగానే ప్రపంచ వ్యాప్తంగా మూడో వేవ్ విస్తరిస్తోంది. ఇందులో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ‘ఒమిక్రాన్’ కీలక భూమిక పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125 దేశాలకు పైనే విస్తరించిన ఒమిక్రాన్ పుణ్యమా అని.. కేసుల మీద కేసులు పుట్టుకొస్తున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోరికార్డు స్థాయిలో రోజుకు పది లక్షలకు పైనే కేసులు నమోదు కావటం.. మొన్నటి వరకు తూతూ మంత్రంగా ఉన్న భారత్ లో ఇప్పుడు రోజుకు లక్షకు పైనే కేసులు నమోదు కావటమే కాదు.. రానున్న రోజుల్లో మరింత జోరు పెరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి వేళ.. ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ జత కలిసి డెల్టాక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ బయటకు వచ్చిందంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చినా.. వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఇప్పుడా కాంబినేషన్ లో కేసులు తమ దేశంలో నమోదు అవుతున్నట్లుగా సైప్రస్ ప్రకటించింది. గత ఏడాది భారత్ లో కనిపించిన డెల్టా వేరియంట్ ఎంతటి దారుణ పరిణామాలకుకారణమైందో తెలిసిందే. దాని తీవ్రతను.. తాజాగా వాయు వేగంతో విస్తరిస్తున్న ఒమిక్రాన్ సంక్రమణంలో.. ఈ సరికొత్త వేరియంట్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
ప్రస్తుతం ఒమిక్రాన్.. డెల్టా కో-ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయని.. వాటిని తాము గుర్తించినట్లుగా సైప్రస్ వెల్లడించింది. సైప్రస్ యూనివర్సిటీ బయాలజికల్ స్సైన్సెస్ ప్రొఫెసర్.. లెబోరేటరీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మ్యాలిక్యులర్ వైరాలజీ అధిపతి లియోండియోస్ కోస్ట్రికిస్.. ‘‘డెల్టాక్రాన్’ గురించి వెల్లడించారు. ఈ రెండింటి కాంబినేషన్ లో ఉన్న స్ట్రెయిన్ ను కనుగొన్నామన్నారు. ఈ స్ట్రెయిన్.. డెల్టాకు సమానమైన జన్యు నేపథ్యాన్న కలిగి ఉందని.. అలాగే కొన్ని ఒమిక్రాన్ మ్యుటేషన్లు ఉన్నట్లుగా చెప్పారు. ఇప్పటివరకు తమ దేశంలో 25 డెల్టాక్రాన్ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు.
కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల్లో ఈ స్ట్రెయిన్ మ్యుటేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందని తమ అధ్యయనంలో తేలినట్లుగా చెప్పారు. అయితే.. ఈ డెల్టాక్రాన్.. ఒమిక్రాన్ మాదిరి మరింత ప్రమాదకరమైనదా? దాని వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఏమైనా.. మొన్నటివరకు డెల్టాక్రాన్ వేరియంట్ మీద వినిపించిన వాదనలకు భిన్నంగా స్రైపస్ లో ఈ తరహా కేసులు నమోదు కావటం కొత్త ఆందోళనకు దారి తీస్తుందని చెప్పక తప్పదు.