(రైతుల నిరసన ఆందోళన మొదలైన రోజు నుంచీ ఆ రైతులతో పాటు ఉన్న ‘గురుప్రీత్ వాసి’ అనే మిత్రుడు తన వాల్ మీద నిన్న రాత్రి రాసిన ఆగ్రహ ప్రకటన తెలుగులో)
భారతదేశం అనే భావనలో నాకు విశ్వాసం ఉంది.
నేను భారతీయుణ్నని గర్వంగా చెప్పుకుంటాను.
హింస అనే ఆలోచననే నేను వ్యతిరేకిస్తాను
నేను గాంధీ అభిమానిని.
నాకు ఢిల్లీ అంటే ప్రేమ. మన జాతీయ పర్వదినాలను నేను ప్రేమిస్తాను.
ఇదంతా ఇంత ప్రత్యేకంగా ఎవరికైనా చెప్పవలసిన అవసరం రాకుంటే బాగుండుననుకుంటాను.
కాని ఇవాళ్టి రోజు ఎటువంటిదంటే, ఒక శాంతియుతమైన నిరసన ప్రదర్శన శత్రుపూరితంగా మారి నేను అనుమానితుడిగా మారిపోయాననిపిస్తున్నది. రెండు నెలలుగా మన సరిహద్దుల మీద కుతకుత ఉడుకుతున్న వేదననూ, అసంతృప్తినీ చూడకుండా మనం కళ్లు మూసుకున్నాం. ఇవాళ అది పెటిల్లున ఉబికివస్తే, ఇదేదో అనూహ్యంగా, ఆఘాతం జరిగినట్టు ప్రతి ఒక్కరూ కనుబొమలు ఎగరేస్తున్నారు. దవడ కండరాలు బిగించుకుంటున్నారు.
మరి ఏం జరుగుతుందని మీరు ఆశించారు?
ఎర్రకోట దిగ్బంధనాన్ని ఛేదించుకుని వెళ్లకుండా కొన్ని వందల మంది ఆగంతకులను ఇరవై వేల మంది సాయుధ బలగాలు, మహా ఘనత వహించిన పోలీసు దళాలు, అల్లర్లను అణచివేసే ప్రత్యేక బలగాలు, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఆపలేకపోయాయని అనుకుంటున్నారా?
ఆ చక్రబంధాన్ని బద్దలు కొట్టి రైతులు లోపలికి ప్రవేశిస్తుంటే మహా కర్కోటకుడైన మన హోం మంత్రి ధ్యానముద్రలో మునిగి ఉన్నాడనుకుంటున్నారా?
ట్రాక్టర్ల ఊరేగింపును ఆపమని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన అదే పోలీసులు, కొద్ది రోజుల్లోనే హఠాత్తుగా, అతి సులభంగా, “ఉదారంగా” ఆ దరఖాస్తును ఉపసంహరించుకుని అనుమతి ప్రసాదించారు.
ఇది రైతుల నిరసన ప్రదర్శనలను భగ్నం చేయడానికి జరిగిన అత్యంత భయానకమైన కుట్ర అనీ పన్నాగమనీ మీకు అనిపించడం లేదా?
గత రాత్రి నేను సింఘులో ఉన్నాను. అధికారులకూ, నలబై రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య ఒప్పందం కుదిరిన ట్రాక్టర్ ఊరేగింపు మార్గాన్ని తాము అనుసరించబోమని, సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వామి కాని ఒక రైతుల బృందం హఠాత్తుగా ప్రకటించింది.
భారతీయ జనతా పార్టీ తొత్తుగా అందరికీ తెలిసిన దీప్ సిద్ధు హఠాత్తుగా వేదిక మీదికి వచ్చి, రైతుల నిరసనలకు భంగకరంగా వేర్పాటువాదం మీద రెచ్చగొట్టే ఉద్రేకపూరిత ఉపన్యాసం ఇచ్చాడు.
దానికి వందలాది మందిమి సాక్షులుగా ఉన్నాం. ఈ ప్రమాదకరమైన మలుపు ఏ ముప్పు తీసుకురాబోతుందో అంచనావేస్తూ మేమంతా కంటిమీద రెప్ప వాలకుండా రాత్రి గడిపాం. నాకైతే ఊపిరి ఆడలేదు.
ఇవాళ ఉదయం, రైతుల ఊరేగింపు మధ్యాహ్నం ప్రారంభం కావాలని అనుకున్నాం. కాని “కార్యాచరణ తెల్లవారు జామునే మొదలవుతుంది” అని ఒక పత్రికావిలేఖరికి లోపలి నుంచి సమాచారం అందిందని నాతో పాటు ఉన్న వ్యక్తి రాత్రే నాకు చెప్పారు.
ఆమెకు ఈ సంగతి ఎలా తెలిసింది అని నేను ఆలోచించాను.
ఈ ‘లోపలి నుంచి’ అందిన సమాచారం ప్రకారమే, సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వామి కాని ఒక రైతు బృందం ఉదయం ఎనిమిది గంటలకే సరిహద్దు దగ్గరికి చేరింది. సరిగ్గా ఆ సమయానికే ఖాళీ డిటిసి బస్సులు వ్యూహాత్మకంగా తెచ్చి అడ్డంగా పెట్టారు. అంటే ఆ బస్సులను ధ్వంసం చేసినా, తొలగించినా “ప్రభుత్వ ఆస్తుల” విధ్వంసం అనే వార్త చాల సులభంగా కెమెరాలకు ఎక్కే అవకాశం ఏర్పడిందన్నమాట. అమ్ముడు పోయిన టివి మీడియా మొత్తమూ ఈ దృశ్యాలను నిరంతరాయంగా చూపుతూ వచ్చాయి. వారు అంత కచ్చితంగా ఆ సమయానికి అక్కడికి చేరగలిగారన్నమాట.
సరిగ్గా సినిమాల్లో జరిగినట్టుగా బిజెపి తొత్తు దీప్ సిద్ధూ నాయకత్వంలోని గుంపుకు ఎర్రకోట భవనం లోపలికి వెళ్లే అవకాశమూ దక్కింది. అది కూడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండే రిపబ్లిక్ డే రోజున!!
గుంపులుగా గుంపులుగా పోలీసులూ, సాయుధ పారా మిలిటరీ బలగాలూ ఎర్రకోట గోడల మీది నుంచి అగ్గిపుల్లల లాగ కిందికి పడిపోయారు!
ఇదంతా ఉన్నది ఉన్నట్టు నమ్మేంత అమాయకులమా, వెర్రివాళ్లమా మనం? ఇదేమైనా నెట్ ఫ్లిక్స్ వాళ్లు తీస్తున్న సినిమానా? భద్రతా బలగాల చెయ్యి లేకుండా ఇటువంటి ఘటన జరుగుతుందని మీరు ఊహించగలరా?
ఆ తర్వాత ఒక మత జెండా (నిషాన్ సాహిబ్) ను ఎర్రకోట మీద ఒక స్తంభానికి కట్టారు. తద్వారా రైతులందరూ ఖలిస్తాన్ మద్దతుదారులే అని చూపదలచుకున్నారు. అంటే రెండు నెలలుగా ప్రభుత్వం నమ్మించడానికి ఎంతో కష్టపడుతున్న అబద్ధాన్ని నిజం చేసేశారు.
ఇంత పెంట మీ కళ్లలో, చెవుల్లో, నోట్లో కుక్కుతుంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా, థూ…
విషాదం ఏమంటే, సంయుక్త కిసాన్ మోర్చాలోని నలభై సభ్య సంఘాలూ అమాయకంగా తమకూ ప్రభుత్వానికీ ఒప్పందం కుదిరిన మార్గం మీద తమ ట్రాక్టర్ ఊరేగింపును అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికే ప్రారంభించాయి. కొద్ది మంది స్నేహితులతో కలిసి ఈ ట్రాక్టర్ల ఊరేగింపుతో పాటు కొన్ని గంటల పాటు నేనూ సాగాను. ఢిల్లీ ప్రజానీకం ఈ ఊరేగింపు మీద పూల రెక్కలు జల్లుతూ ఉండింది. ఈ అధికారిక ఊరేగింపును ఒక్కటంటే ఒక్క జాతీయ చానల్ కూడ చూపలేదు. సంయుక్త కిసాన్ మోర్చా చానల్ లో చూపుతున్న ఈ ఊరేగింపు దృశ్యాలను దేశమంతా చూడకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మకంగా ఇంటర్నెట్ ఆపేశారు.
ఇప్పుడు ఫేస్ బుక్ లో పురుగులు తమ గూళ్లలోంచి బైటికి కదులుతూ ‘హింస జరిగినందుకు అభినందనలు’ అంటూ నాకు సందేశాలు పంపుతున్నారు! మీ సందేశాలను మీరే తీసుకుని ఎక్కడ చెక్కుకోవలసి ఉందో అక్కడ చెక్కుకోండి. రిపబ్లిక్ డే అనేది మీ తాతగారి పెళ్లిరోజేమీ కాదు. అది నాదీ నీదీ మనదీ ఈ దేశస్తులందరిదీ.
దూరదూరాల నుంచి వచ్చిన అమాయకులైన, సాదాసీదా రైతులను, తమ ట్రాక్టర్లను అలంకరించుకొని వచ్చిన రైతులను, తమ సొంత ఊరేగింపు కోసం కొత్త దుస్తులు ధరించి వచ్చిన రైతులను, మీ కలుషిత రాజకీయాలకు పావులుగా వాడుకున్నారని చూస్తే మనసు చివుక్కుమంటున్నది. మన 72వ రిపబ్లిక్ డే పవిత్రత మీద మీ దుర్మార్గ రాజకీయాల మరకలు చూసి నొప్పి కలుగుతున్నది.
మీరు అసలు నేరస్తులు. వాళ్లు కాదు.