కొన్నిసార్లు అంతే. అనూహ్య రీతిలో వచ్చే అవకాశంతో పాటు.. అరుదైన రికార్డును క్రియేట్ చేసే ఛాన్స్ సొంతమవుతుంది. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎంపికైన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా. ఢిల్లీ సీఎంగా నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆమె.. బీజేపీలో ఇస్పెషల్ కానున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్.. బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిశీలు సీఎంలుగా పని చేశారు. ఇప్పుడు రేఖా గుప్తాకు అవకావం దక్కింది.
గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దివంగత సుష్మా స్వరాజ్ కేవలం 52 రోజులు మాత్రమే పని చేశారు. నిజానికి బీజేపీకి చెందిన మహిళా నేతలకు ముఖ్యమంత్రి అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది. అలాంటిది రేఖా గుప్తకు లభించిన ఈ అవకాశం చాలా అరుదైనదిగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బీజేపీలో తిరుగులేని రికార్డును క్రియేట్ చేయటం ఖాయమంటున్నారు.
తమ ముఖ్యమంత్రులను ఇట్టే మార్చేసే ధోరణి బీజేపీలో ఉండదు. ఒకసారి డిసైడ్ చేస్తే.. అలా కంటిన్యూ చేస్తుంటారు. రేఖా గుప్తాకు అలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ ఒక్కరికే అవకాశం లభించటం.. అది కూడా రెండు నెలల కంటే తక్కువ కాలమే సీఎంగా ఉన్న నేపథ్యంలో.. రేఖా గుప్తా ఈ కాలాన్ని ఇట్టే దాటేస్తారు. అంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మహిళా నేత రేఖా గుప్తా సుదీర్ఘకాలం పాలించిన రికార్డును సొంతం చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశంలో అత్యధిక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బీజేపీకి చెందిన వారే ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు కూడా మహిళలు లేరన్నది మర్చిపోకూడదు. ఆ లెక్కన చూసినా.. రేఖా గుప్తా బీజేపీలో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న మహిళా నేతగా నిలుస్తారు. మొత్తంగా అనూహ్యంగా తెర మీదకు వచ్చిన రేఖా గుప్తా.. రానున్న రోజుల్లో బోలెడన్ని రికార్డుల్ని తన పేరు మీద లిఖించుకోవటం ఖాయమని మాత్రం చెప్పక తప్పదు.