ఎర వేయటం.. అందులో చిక్కుకున్న వారి నుంచి మొహమాటం లేకుండా దోచేసే సైబర్ నేరగాళ్ల చేతిలో తాజాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె మోసం పోవటం సంచలనంగా మారింది. పాత సోఫాను అమ్మే క్రమంలో ఆమెను సైబర్ నేరగాళ్లు బురుడీ కొట్టింది.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలుసు కదా? ఆయనకు ఒక కుమార్తె.. కుమారుడు ఉన్నారు. ఢిల్లీ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమెకు.. తాజాగా సైబర్ కేటుగాళ్లు తమదైన శైలిలో షాకిచ్చారు.
సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత.. ఒక సెకండ్ హ్యాండ్ సోఫాను ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. ఆన్ లైన్ లో ఇచ్చిన వివరాలతో ఒక వ్యక్తి ఆమెను కాంటాక్టు చేశాడు. సోఫాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించాడు. డబ్బులు పంపుతానని చెప్పిన అతను.. ఒక బార్ కోడ్ స్కాన్ చేయాల్సిందిగా లింకు పంపాడు. ఆమెకు నమ్మకం కలిగేందుకు వీలుగా ఆమె బ్యాంకు ఖాతాకు కొంత మొత్తాన్ని జమ చేశారు.
దీంతో.. అతన్నినమ్మిన హర్షిత.. సైబర్ కేటుగాడు చెప్పినట్లే బార్ కోడ్ ను స్కాన్ చేసింది.
అంతే.. కాసేపటికి ఆమె ఖాతా నుంచి రూ.20వేలు ఒకసారి.. రూ.14వేలు ఒకసారి కట్ అయ్యాయి. దీంతో.. తాను మోసపోయినట్లుగా గుర్తించిన ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సీఎం కుమార్తెను బురుడీ కొట్టించిన కేటుగాళ్ల కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. మరి.. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందా? అయినా.. ఐఐటీలో చదివిన హర్షిత.. సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కుకోవటం సంచలనంగా మారింది.