టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయి.. విచారణ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించిన నిధుల్లో 241 కోట్ల రూపాయలను దారి మళ్లించి.. తమ ఖాతాలకు బట్వాడా చేసుకున్నారన్న ప్రధాన అభియోగంతో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడం.. ఏసీబీ కోర్టు తీర్పుతో ఆయనను జైలుకు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ చర్చకు దారితీసింది.
అయితే…బాబు అరెస్టు, అనంతరం జైలు.. వంటి పరిణామాలపై సంచలన విశ్లేషణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ అరెస్టును అంత తేలికగా తీసుకునేది కాదని, ఇది ఒక్క రాష్ట్ర సర్కారు వల్ల అయ్యే పనికాదని, దీని వెనుక ఢిల్లీ స్థాయిలో `ఏదో` వ్యూహం జరిగిందని కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో నాయకులు కూడా కేంద్రం పెద్దలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
మొత్తంగా చూస్తే..చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ ప్రోత్సాహం.. వ్యూహం ఉన్నాయనే చర్చకు మరింత బలం చేకూర్చేలా నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదన్నారు. ఏసీబీకి కోర్టు తీర్పు దారుణమన్న ఆయన తీర్పు సరిగ్గా లేదని మండిపడ్డారు.
వేకువజామున ఒక భారీ ప్రొఫైల్, కట్టుదిట్టమైన భద్రత ఉన్న నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం ఏంటని చింతా మోహన్ ప్రశ్నించారు. అంతేకాదు.. బాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ హస్తం ఉందని జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఢిల్లీకి సంబంధం లేకుండా ఈ అరెస్టు జరగదన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఉండరని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు అరెస్టు దరిమిలా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఢిల్లీ వైపే అందరి వేళ్లూ చూపిస్తుండడం సంచలనంగా మారింది.