అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కాలేజీలో సోమవారం జరిగిన లాఠీచార్జి ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎయిడెడ్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే క్రమంలో పోలీసులు…అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. అంతేకాదు, పోలీసుల దాడిలో జయలక్ష్మి అనే డిగ్రీ విద్యార్థిని తలకు గాయం కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు తీరు వివాదస్పదం కావడంతో జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, ఆ వ్యవహారం సద్దుమణగక ముందే…జయలక్ష్మి అదృశ్యం కావడం కలకలం రేపింది. కానీ, జయలక్ష్మి అదృశ్యంతో తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, ఆమె ఆచూకీపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తానెక్కడున్నది తెలియజేస్తూ..జయలక్ష్మి తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. తాను బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నానని జయలక్ష్మి చెప్పింది. తన తలకు రాయి తగిలి దెబ్బ తగిలిన తర్వాత చికిత్స తీసుకున్నానని, ఇపుడు తాను బాగానే ఉన్నానని జయలక్ష్మి చెప్పింది.
అయితే, ఆ ఘటన తర్వాత తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, చార్జింగ్ కూడా తక్కువగా ఉండడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని వెల్లడించింది. ఆ తర్వాత తాను తన బంధువుల ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నానని జయలక్ష్మి తెలిపింది. అంతకుముందు, సోమవారం సాయంత్రం నుంచి జయలక్ష్మి మిస్సింగ్ గా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు, ఆమె ఇంటికి కూడా తాళం వేసి ఉండడం, ఆమె తల్లిదండ్రులు కూడా కనిపించకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
దీంతో, జయలక్ష్మి ఆచూకీ కోసం విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు గాలించడం మొదలుబెట్టారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పించారు. పోలీసుల దగ్గరే జయలక్ష్మి ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ”జయలక్ష్మి ఎక్కడ?” అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలోనే స్పందించిన జయలక్ష్మి…తాజాగా వీడియో విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియో వైరల్ అయింది.
మరోవైపు, ఎస్ఎస్బీఎన్ కళాశాల గవర్నింగ్ సభ్యుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సెక్రటరీ, కరస్పాండెంట్ తీరుపై కౌన్సిల్ సభ్యుడు విఠల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం నుంచి సెక్రటరీ, కరస్పాండెంట్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. రెండేళ్లుగా గవర్నింగ్ సమావేశం జరగలేదని, ఎయిడెడ్‌ను ప్రైవేట్‌గా మార్చే అంశంపై సభ్యులకు సమాచారం కూడా లేదని విఠల్ తెలిపారు. ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో బినామీ టెండర్లతో యాజమాన్యం చేస్తోందని, ప్రభుత్వ ఆధీనంలో విద్యాసంస్థ నడిస్తే బాగుంటుందని విఠల్ అభిప్రాయపడ్డారు