బాలీవుడ్ ఖాన్ త్రయం ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయేవారు. ముఖ్యంగా షారుక్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉండేవాడు. అయితే, కొంతకాలంగా వరుస పరాజయాలు కింగ్ ఖాన్ ను వెంటాడుతున్నాయి. అందుకే, తన తర్వాత చిత్రం పఠాన్ పై ఆయనతోపాటు ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు షారుక్ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో షారుక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. రా ఏజెంట్‌గా నటిస్తున్న షారుక్ ను పరిచయం చేస్తూ విడుదలైన ఈ చిత్ర టీజర్ అంచనాలను మరింత పెంచింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘బేషరమ్ రంగ్’ సాంగ్ విమర్శల పాలవుతోంది. వాస్తవానికి ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ…అందరినీ ఆకట్టుకుంటోంది.
ఎయిట్ ప్యాక్‌తో షారుఖ్ వావ్ అనిపిస్తుండగా…బికినీలో దీపిక మత్తెక్కిస్తోంది. ఈ జంట మధ్య కెమిస్ట్రీ కుదరడంతో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకెళుతోంది. కానీ, ఈ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై మాత్రం వివాదం రేగింది. ఈ పాటను పరోక్షంగా విమర్శిస్తూ కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ మధ్య బాలీవుడ్ పాటలు ఇన్ స్టా రీల్స్ కంటే చెత్తగా ఉన్నాయని వివేక్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీజేపీని టార్గెట్ చేస్తూనే కాషాయ రంగు బికినీ వేసి బేషరమ్ రంగ్ అంటూ పాట పాడారని కొందరు షారుక్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ పాటలో దీపికా మరో రెండు రంగుల బికినీలు కూడా ధరించింది, దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.