పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే నటిస్తోన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన దీపికా పదుకొణే…స్వల్ప అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సెట్స్ లోనే హఠాత్తుగా దీపికా పదుకొణే హార్ట్ బీట్ పెరిగిపోవడంతో షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటీన కామినేని ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లిందట.
కామినేని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదని వైద్యులు చెప్పారట. దీంతో, దీపికా తాను బస చేసిన నోవాటెల్ హోటల్‌కు వెళ్లిపోయిందట. నోవాటెల్లోనూ దీపికా పదుకొణే వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమెకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో ఆ చిత్రం కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో దీపికా పదుకొణె షూటింగ్లో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీపికా పదుకొణె ‘ప్రాజెక్టు K ‘తో నేరుగా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతోపాటుగా ‘సర్కస్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న దీపికా…షారుక్ ఖాన్‌తో కలిసి ‘పఠాన్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు దీపికా ఓ హాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.