వెండితెర వేల్పుగా వెలిగిపోయే వారు రియల్ లైఫ్ లో ఎంత బేలగా ఉంటారన్న విషయం తాజా పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రీల్ లో చెలరేగిపోయే వారు.. అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. బాధ్యతల్ని మరిచి పోయి వ్యవహరించే తీరు షాకింగ్ గా మారుతుంది. డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన బాలీవుడ్ అగ్ర తారాగణం.. ఎందుకిలా చేసిందన్న ప్రశ్నకు సూటి సమాధానం లభించదు.
పేరు.. డబ్బు.. కీర్తిప్రతిష్టలు అన్ని ఉన్నా.. మరేదో కావాలనే అత్యాశ.. తామేం చేసినా నడిచిపోతుందన్న భావనే వారి చేత ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా చేస్తుందని చెప్పాలి. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం ఎక్కడో మొదలై మరెక్కడికో వచ్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన బాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికిల తీరు హాట్ టాపిక్ గా మారింది.
శనివారం విచారణకు హాజరైన దీపికా పదుకొణె.. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాల కంటే కూడా ఎక్కువగా ఏడవటంతోనే సరిపోయినట్లు చెబుతున్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం కంటే కూడా కన్నీరు పెట్టుకోవటంతో.. ఎమోషనల్ డ్రామా కట్టిపెట్టాలని అధికారులు ఆమెతో అన్నట్లు చెబుతున్నారు. తాను డ్రగ్స్ వాడలేదని.. కాకుంటే సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయాసాహా తో మాత్రం డ్రగ్ చాట్ చేసినట్లు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదంతా విన్నప్పుడు.. గతంలో తాను తీవ్రమైన కుంగుబాటుకు గురైనట్లుగా దీపిక చెప్పిన విషయం గుర్తుకు రాక మానదు. ఆ తర్వాతి కాలంలో తాను చాలా కష్టంతో బయటకు వచ్చినట్లుగా చెప్పటాన్ని మర్చిపోలేరు. ఇంతకూ ఆమె కుంగుబాటుకు అర్థం.. డ్రగ్స్ కు బాగా అలవాటు పడిపోయి.. దాని నుంచి బయటకు రావటమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏమైనా.. వెండితెర మీద వెలిగిపోయే దీపిక లాంటి వారు.. విచారణ సందర్భంగా చిన్న పిల్లలా ప్రతి దానికి ఏడవటం దేనికి నిదర్శనం? తప్పు చేయటం ఎందుకు.. తల పట్టుకోవటం ఎందుకు? ఈ విషయం స్టార్లకు ఎప్పుడు అర్థమవుతుందో?