హీరోకు సమానంగా హీరోయిన్ కు రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వరు? అన్న ప్రశ్న ఈ మధ్యన ఎక్కువైంది. ఈ మాట మీద స్ట్రిక్ట్ గా నిలబడిన ఒక ప్రముఖ హీరోయిన్ తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ కు మొహమాటం లేకుండా నో చెప్పిన వైనం తాజాగా చోటు చేసుకుంది. బాలీవుడ్ లో ఇప్పుడీ ఉదంతంపై చర్చ సాగుతోంది. నో చెప్పిన నటీమణి టాప్ లో ఉన్న నటీమణి కాగా.. కాదన్న ప్రాజెక్టు కూడా చిన్నా చితకది కాకపోవటం గమనార్హం. సంజయ్ లీలా భన్సాలీ అన్నంతనే ఆయన సినిమాలు ఇట్టే కదలాడతాయి.
శిల్పాన్ని చెక్కినట్లుగా తన చిత్రాన్ని చెక్కే అతి కొద్ది మంది ప్రముఖ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన సినిమాల్లో హిట్ పెయిర్ గా పేరున్న రణ్ వీర్ సింగ్.. దీపికా పదుకొనే. ఈ రీల్ జంట.. రియల్ జంటగా మారటం తెలిసిందే. ఈ హిట్ పెయిర్ తో కలిసి ఒక పాత క్లాసిక్ ను తనదైన శైలిలో కొన్ని మార్పులు చేసి నిర్మించాలని భావించారు. 1952లో వచ్చిన నాటి క్లాసిక్ ‘బైజూ బావ్రా’. తాజాగా అదే పేరుతో నిర్మించి.. విడుదల చేయాలన్నది సంజయ్ ఆలోచన.
ఇప్పటితరానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయాలని భావించారు. ఇందులో హీరో పాత్రకు రణ్ వీర్ సింగ్ పేరును ఓకే చేశారు. హీరోయిన్ గా నిజ జీవితంలో రణ్ వీర్ సతీమణి అయిన దీపికాను అడిగారట. సినిమా చేసేందుకు అభ్యంతరం చెప్పని ఆమె.. అనూహ్యమైన డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారట. ఈ సినిమాలో తనకు హీరోతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పారట.
అయితే.. తాను అంత ఇవ్వలేనని డైరెక్టర్ చెప్పటంతో.. ఆమె సినిమా చేసేందుకు నో చెప్పేశారట. హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఎందుకివ్వరన్న డిమాండ్ ఈ మధ్యన ఎక్కువ కావటమే కాదు.. అందుకు కాదంటే.. సినిమాలు చేసేందుకు ఇష్టపడని కథానాయికిలు ఎక్కువ అవుతున్నారు. తాజాగా దీపికా అదే పని చేశారన్న మాట వినిపిస్తోంది.