‘స్కామ్ 1992‘…2020లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ లో ‘బిగ్ బుల్’ గా పేరున్న హర్షద్ మెహతా చేసిన బ్యాంక్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ కమ్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. బ్యాంకులలోని లొసుగులను అడ్డుపెట్టుకొని హర్షద్ మెహతా రూ.500 కోట్ల స్కామ్ చేసిన నేపథ్యంలో తెరకెక్కిందా వెబ్ సిరీస్.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా హర్షద్ మెహతాకు కొన్ని బ్యాంకులు నగదు బదిలీ చేయడం…చివరకు ఆర్బీఐ ఆ వ్యవహారంపై ఫోకస్ చేయడంతో ఆ స్కామ్ గుట్టురట్టు కావడం…ఇది ఆ వెబ్ సిరీస్ కాన్సెప్ట్. అయితే, 1992లో జరిగిన ఆ స్కామ్ మాదిరిగానే 2022లోనూ మరో స్కామ్ జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ‘స్కామ్ 1992‘ ముంబైలో జరిగితే…‘స్కామ్ 2022‘ మాత్రం ఏపీలో జరగడానికి పుష్కలంగా చాన్స్ ఉందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ స్కామ్ కు కర్త, కర్మ, క్రియ హర్షద్ మెహతా అయితే…ఈ స్కామ్ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సీఎం జగన్ అని టాక్ వస్తోంది.
జగన్ అప్పుల గురించి…తిప్పల గురించి చాలాకాలంగా వింటూ, చదువుతూ, రాస్తూనే ఉన్నాం. రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పెట్టుబడులు తేవడం ఎలా అన్న ధ్యాస లేని జగన్… అప్పులు తేవడం ఎలా అనే విషయంపై మాత్రం గట్టిగానే ఫోకస్ చేశారని విమర్శలు వచ్చాయి. అందుకే, బ్యాంకులు మేమివ్వం మొర్రో అంటున్నా సరే…వాటిపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి…కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి..మాజీ ఎస్ బీఐ చైర్మన్ వంటి వారితో చెప్పించి మరీ అప్పులు తెచ్చుకుంది జగన్ సర్కార్.
సరైన తనఖా లేకుండా, కచ్చితమైన ఆదాయం, చెల్లింపుల విషయం తేలకుండా ఏపీ ప్రభుత్వం ఒత్తిడితో వేలకోట్ల రుణాలను బ్యాంకులు ఇచ్చేశాయి. ఒకవేళ ఇంకా అప్పుల ఇస్తే తెచ్చుకునేందుకు జగనన్న రెడీగా ఉన్నా…ఏపీ ఆర్థిక దుస్థితి చూసిన బ్యాంకులు మాత్రం తలుపులు మూసేశాయి. పుట్టగొడుగుల్లా కార్పొరేషన్లు క్రియేట్ చేసి వాటికి లేని ఆదాయాన్ని చూపించి లోన్లు తెద్దామనుకన్న జగన్..ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేడెట్ ఫండ్ నుంచి డబ్బులు చెల్లించేందుకు సిద్ధమని చెప్పేసరికి బ్యాంకులు కాదనలేక సరే అన్నాయి.
అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఎందుకంటే, అలా అడ్డగోలుగా ప్రభుత్వానికి, కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చేందుకు ఆర్బీఐ నిబంధనలు అంగీకరించవు. ప్రభుత్వాలకు అప్పు ఇచ్చే పద్దతులను, నిబంధనలను బ్యాంకులు ఉల్లంఘించి మరీ జగనన్నకు లోన్లు ఇచ్చాయి. అయితే, కాస్త ఆలస్యంగా అయినా ఆర్బీఐ కళ్లు తెరిచి సదరు బ్యాంకులకు నోటీసులివ్వడంతో ఇపుడు ఏపీకి అప్పిచ్చిన బ్యాంకుల కొంప మునిగేలా ఉంది.
బ్యాంకులకు ఏపీ ప్రభుత్వం లోన్లు చెల్లించే పరిస్థితి లేదు…దీంతో, ఆర్బీఐకి ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియక సదరు బ్యాంకులు సతమతమవుతున్నాయట. నిబంధనలు ఉల్లంఘించి ఏపీకి అప్పులిచ్చినట్లుగా తేలితే…సదరు బ్యాంకులకు జరిమానా విధించే అవకాశాలున్నాయట. ఇక, ఏ బ్యాంక్ నుంచి ఏం తనఖా పెట్టి ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో ఇటు జగన్ సర్కార్ కు స్పష్టత లేదు.
అటు బ్యాంకులు కూడా తమ పరువు పోతుందని ఆ వివరాలు గోప్యంగా ఉంచుతున్నాయి. ఇంత కాలం ఏపీ అప్పులపై పెద్దగా ఫోకస్ చేయని ఆర్బీఐ..ఇపుడు కొరడా ఝుళిపించడంతో జగన్ సర్కార్, సదరు బ్యాంకులు టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయట. దీంతో, అచ్చు ‘స్కామ్ 1992‘ తరహాలోనే ‘స్కామ్ 2022‘ ఏపీలో జరగడం ఖాయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.