అందుకే అంటారు యుద్దం అసలే వద్దని. ఎందుకంటే.. ఒకసారి వార్ అన్నది మొదలయ్యాక మిగిలేది నష్టమే తప్పించి.. మరింకేమీ మిగలదు. శవాల గుట్టలు.. అందంగా ఉండే నాగరికత మొత్తం నాశనమైవుతుంది. ఏళ్ల కొద్దీ కష్టంతో నిర్మించిన కట్టడాలన్నీ నిమిషాల్లో నామరూపాల్లేకుండా అయిపోతాయి. ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడి.. ఆ దేశ సరిహద్దుల్లో రక్తపుటేరులను పారించిన హమస్ మూకను ఏరేసేందుకు ఇజ్రాయెల్ సోమవారం భారీగా ఆకాశ మార్గాన క్షిపణుల్ని సంధించింది. హమాస్ కొలువున్న గాజా సిటీలో రాకెట్లతో మోత మోగించింది.
ఓవైపు గాజాపై వైమానిక దాడుల్ని పెద్ద ఎత్తున చేపడుతూ.. మరోవైపు తమ సరిహద్దుల్లోకి మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవటానికి వీలుగా యుద్ధ ట్యాంకులు.. డ్రోన్లను మొహరించింది. సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా నగరంలోని వందలాది భవనాలు నేలమట్టం కావటమే కాదు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా సౌత్ పార్టులో మహిళలు.. చిన్నారులతో సహా 19 మంది మరణించారు.
మరోవైపు ఇజ్రాయెల్ సైనికులపై హమస్ మిలిటెంట్లు కాల్పులు జరుపుతున్నారు. అప్పుడప్పుడు రాకెట్ దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని ఇజ్రాయెల్ సైన్యం తిప్పి కొడుతోంది. గాజాలోని వెయ్యికి పైగా టార్గెట్లపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. సోమవారం ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా సిటీలో ఏటు చూసినా శిధిలాలే కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఎదురుదాడిలో గాజా సిటీలో 500 మందికి పైనే మరణించి ఉంటారని చెబుతున్నారు.
ఇక.. హమస్ ఒక ప్రకటన చేస్తూ ఇజ్రాయెల్ లో తమ వారు 130 మందికి పైనే పౌరుల్ని బందీలుగా పట్టుకున్నట్లుగా పేర్కొంటూ.. వారంతా తమ అధీనంలో ఉన్నట్లుగా వెల్లడించారు. గాజాలోని ముష్కరుల్ని తుదముట్టిస్తామన్న శపధాలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ. హమాస్ ను ఇప్పటికే బలహీనపర్చినట్లుగా ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. గాజాను పూర్తిగా దిగ్బంధించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు.
గాజాకు విద్యుత్ సరఫరాతో పాటు ఆహారం.. మంచినీటి సరఫరా కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా గాజా నగరంలోని 1,23,000 మంది నిరాశ్రయులయ్యారని.. ఇళ్లు విడిచి పెట్టి బయట ప్రాంతాలకు వెళ్లిపోయినట్లుగా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరిని విడిపించటమే తమ లక్ష్యమని హమస్ చెబుతుంటే.. హమస్ చేతిలో బంధీలుగా ఉన్న వారిని విడిపించేందుకు సహకరించాలని ఈజిప్టును ఇజ్రాయెల్ కోరింది. మొత్తంగా ఇరువురి మధ్య యుద్ధం మరింత ముదిరిపోతోంది.