కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఓ వైపు కరోనా సోకి కుటుంబంలోని సభ్యులు మొత్తం చనిపోవడం…ఒకరు చనిపోయినట్లు మరొకరికి తెలియని హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు, కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్త సంబంధికులు, కన్నవారు, తోబుట్టువులూ ముందుకు రాని దయనీయ పరిస్థితినీ చూస్తున్నాం. ఇక, కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు తమ ప్రాంతంలో చేయొద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్న ఘటనలూ చూశాం. ఇదంతా నాణేనికి ఒక వైపు.
కరోనా కాలంలో మానవత్వం మంటగలిసిపోతోందనుకుంటున్న తరుణంలోనూ మానవత్వం, ప్రేమాప్యాయతలూ ఉన్నాయని చాటిచెప్పే ఘటనలూ నాణేనికి మరోవైపు ఉన్నాయి. కరోనా కాటేస్తుందన్న భయం లేకుండా మేమున్నామంటూ ముక్కూ మొహం తెలియని వారి అంత్యక్రియలు చేస్తున్న మనసున్న మారాజుల గురించి వింటున్నాం. కళ్ల ముందే కరోనాతో తల్లడిల్లుతూ తుదిశ్వాస విడవబోతోన్న తండ్రి నోట్లో తులసి తీర్థంలా మంచినీరు పోసి కూతురి ఉదంతం గురించి చదివాం.
ఈ తరహాలోనే తాజాగా తాజాగా రాజస్థాన్లోని బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో జరిగిన హృదయవిదారక ఘటన పలువురిని కలచి వేసింది. కరోనాతో చనిపోయిన తండ్రి చితి మంటల్లోకి కూతురు దూకేసిన ఘటన కలకలం రేపింది. గారాబంగా పెంచిన తండ్రి చనిపోయిన విషయాన్ని తట్టుకోలేని కూతురు తండ్రితోపాటే తరలిరాని లోకాలకు వెళ్లాలని ప్రయత్నించడం పలువురితో కంటతడి పెట్టించింది.
రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తి కరోనాతో చనిపోయారు. స్థానిక పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, దామోదర్ దాస్ చితికి నిప్పటించిన వెంటనే అతడి కుమార్తె శారద చితిపైకి దూకేసింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న స్థానికులు, బంధువులు ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు 70 శాతం కాలిన గాయాలతో చికిత్ప పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు