ప్రభుత్వాల్లో అత్యున్నత పదవుల్లో ఉండే వ్యక్తులు బయటకు వెళ్లాలంటే.. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్కడా ఆగకుండా ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందే.
ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయి నేతలు బయటకు అడుగుపెట్టారంటే వాళ్ల కాన్వాయ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయేందుకు ఏర్పాట్లు చేస్తారు. దాని వల్ల సామాన్య ప్రజలు గంటల తరబడి రోడ్లపై ఆగిపోయినా పట్టించుకోరనే విమర్శలున్నాయి.
అలాంటిది ఓ రాష్ట్ర గవర్నర్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడమనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.
తాజాగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అలాంటి అనుభవమే ఎదురైంది.
జనగామ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ కారణంగా దత్తాత్రేయ అరగంట సేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు దత్తాత్రేయ హనుమకొండకు వెళ్లారు.
వెళ్లేటప్పుడు ఆయన ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ తిరుగు ప్రయాణంలో సాయంత్రం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
ఆరు గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వల్ల అరగంటకు పైగా ఆయన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.
యశ్వంతాపూర్- నిడిగొండ గ్రామాల మధ్య కేసీఆర్ బహిరంగ సభ జరిగింది.
సరిగ్గా దత్తాత్రేయ వాహనం వచ్చిన సమయంలోనే కేసీఆర్ సభ ముగిసి ఆ వాహనాలన్నీ ఒక్కసారి రోడ్డుపైకి వచ్చాయి.
దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చివరకు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి గవర్నర్ వాహనాన్ని పంపించారు.
ఇలా దత్తాత్రేయ హైదరాబాద్‌కు వెళ్లారు.
మరోవైపు ఈ సభలో కేసీఆర్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధాని మోడీని దేశం కోసం తరిమికొట్టేందుకు పోరాడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.