సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఏపీలో రాజకీయంగా పలుకుబడి ఉన్నవారని, అందుకే ఈ కేసులో సాక్షులను ప్రభావితులను చేసే అవకాశముందని వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేసిన వైనం కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి ఏదైనా పొరుగు రాష్ట్రంలోని హైకోర్టుకు తరలించాలని కూడా సునీత కోర్టును అభ్యర్థించడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తాజాగా మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ దస్తగిరి ఆరోపించడం రాజకీయ దుమారం రేపుతోంది. గతంలోనే తనకు ప్రాణ హాని ఉందంని ఆరోపించిన దస్తగిరి…తాజాగా తన ప్రాణాలకు ముప్పుందని మరోసారి ఆందోళన వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది.
తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి, తనకు ప్రాణహాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని దస్తగిరి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ప్రభుత్వ అధికారులు సీఎం జగన్ చెప్పిన మాటే వింటారని, కనుక తన రక్షణ బాధ్యత జగన్‌దేనని దస్తగిరి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్, జగన్ అంతా ఒక కుటుంబమని దస్తగిరి అన్నాడు. తనను ఏమైనా చేస్తారేమోనన్న భయం వెంటాడుతోందని, పెద్దవాళ్లనే కీలు బొమ్మలుగా చేసి ఆడిస్తున్న కొందరికి తానో లెక్క కాదని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు ప్రాణ భయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తనకు కేటాయించిన గన్మన్లను మార్చడంపై మాత్రమే ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరమని వాపోయాడు. సమస్య తనదని, ఎలాంటి కుట్ర జరుగుతుందో తనకే తెలుసునని కూడా దస్తగిరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కాగా, నిందితుడైన దస్తగిరి అప్రువర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ ఈ కేసులో నిందితులు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు మూడు రోజుల క్రితమే కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దస్తగరి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.