వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు.. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యనే యూట్యూబ్.. ఓటీటీల్లో విడుదలై సంచలనంగా మారిన వివేకం మూవీ ప్రదర్శనను నిలిపి వేసేలా సంబంధిత అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ దస్తగిరి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాను కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ సినిమాను తీసినట్లుగా పేర్కొన్నారు.
ఇందులో తన పేరును అపకీర్తి పాల్చేసేలా పేర్కొన్నారన్న దస్తగిరి.. ‘‘ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సినిమాను ప్రదర్శించకుండా ఆదేశాలు జారీ చేయాలి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హత్య కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉందని.. అందుకే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలన్నారు.
ఈ సినిమాను టీడీపీకి మద్దతు ఇవ్వటంతో పాటు టీడీపీ సోషల్ మీడియా వింగ్ ప్రోత్సాహంతో అన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉందని పేర్కన్నారు. దస్తగిరి తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. ఈసారి ఎన్నికల్లో పులివెందుల నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని.. ఈ సినిమా కారణంగా తన క్లయింట్ నష్టపోతారని పేర్కొన్నారు. ఇది కచ్ఛితంగా హక్కులకు భంగం వాటిల్లేలా చేయటమేనన్న లాయర్ వాదనల నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణకు కోర్టు అంగీకరించింది.
సంచలనంగా మారిన ఈ మూవీను తెలుగుదేశం ప్రమోట్ చేసి.. రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై తదుపరి వాదనల్ని ఈ రోజు (మంగళవారం) ఏపీ హైకోర్టు విననుంది. దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.