ఏపీ సీఎం జగన్ పై పలు అక్రమాస్తుల కేసుల విచారణ పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన జగన్…బెయిల్ పై బయట ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ వ్యవహారంపై హైకోర్టు తలుపుతట్టిన ఆర్ఆర్ఆర్..అవసరమైతే సుప్రీం కోర్టుకూ వెళతానంటున్నారు.
ఒక్క జగన్ మాత్రమే కాదు…ఇలా పలు కేసులు ఎదుర్కొంటోన్న చాలామంది రాజకీయ నాయకులు యథేచ్ఛగా తమ పదవీకాలం ముగించుకొని మరోసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలుగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ, వారిపై ఉన్న కేసులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు నేటి నుంచి రోజువారీ విచారణ జరగనుంది. ఈ కేసులకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లపై ప్రతిరోజు విచారణ జరగనుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపనుంది. దీంతోపాటు, 2012 నుంచి జగన్ పై దాఖలైన 40 వ్యాజ్యాలు విచారణ జాబితాలోకి హైకోర్టు చేర్చింది.
అయితే, ఈ కేసుల్లో వచ్చే వారం నుంచి విచారణ చేపట్టాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ చేపడతామని, అందుకు న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముందుగా హెటిరో, అరబిందో కేసులతో విచారణ మొదలు పెడదామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా లిమిటెడ్లకు భూకేటాయింపుల్లో అవకతకవకలు…అందుకు బదులుగా ఆ సంస్థలు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టడం, క్విడ్ ప్రోకో…వంటి వాటిపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.